పత్తి రైతుల పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. శుక్రవారం (నవంబర్ 21) మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. లక్షెట్టిపేట సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎంపీకి విన్నవించారు రైతులు.
పత్తి రైతులు, మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్ కు లెటర్ రాసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. గత సంవత్సరం ఆన్ లైన్ సమస్య ఉండేదని.. అప్పుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. దీంతో వెంటనే సమస్య పరిష్కారం అయిన విషయం చెప్పారు.
ప్రస్తుతం పత్తి రైతుల సమస్యల పై రెండు రోజుల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తానని హామీ ఇచ్చారు. కిసాన్ కపాస్ యాప్ లో మార్పులు చేయాలని కోరతానని తెలిపారు. L1,L2 సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో పత్తి సాగు ఎక్కువగా ఉందని.. పత్తి రైతులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని హామీ ఇచ్చారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి పత్తి రైతులకు మద్దతు ధర పెంచేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
