అసెంబ్లీ నిర్మాణంపై  ఏంచేద్దాం?

అసెంబ్లీ నిర్మాణంపై  ఏంచేద్దాం?
  • పడగొట్టి అక్కడే కొత్తది కడదామా..
  • మరోచోట ఎక్కడన్నా నిర్మిద్దామా?
  • ప్రభుత్వంలో తర్జనభర్జన
  • కోర్టు తీర్పు చదవలేదన్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: ఎర్రమంజిల్​ను కూల్చొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇప్పటికే అక్కడ అసెంబ్లీ నిర్మాణానికి సీఎం భూమి పూజ కూడా చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే సెక్రటేరియెట్ భవనాలతో పాటు ఎర్రమంజిల్​బిల్డింగ్​నూ కూల్చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకోర్టు తీర్పుతో ఏంచేయాలనే విషయంపై సర్కారు తర్జనబర్జన పడుతోంది. ఎర్రమంజిల్​కూల్చివేత నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కిన రాజకీయ పార్టీలు కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్నట్లు అక్కడే భవన నిర్మాణం చేయాలంటే ఏంచేయాలనే దానిపై ప్రభత్వం చర్చలు జరుపుతోంది. సీఎం కేసీఆర్​ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయరని, అసెంబ్లీ నిర్మాణంపై ఆయన ఏంచేయబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు. కూల్చివేత నిర్ణయంలో నిబంధనలు పక్కన పెట్టిందనేది కోర్టు అభ్యంతరం.. అందువల్ల నిబంధనల ప్రకారమే ఎర్రమంజిల్​ను వారసత్వ కట్టడాల జాబితాలో నుంచి తొలగించే అవకాశం ఉందని మరో అధికారి చెప్పారు. దీనికోసం హెరిటేజ్​ కన్సర్వేటివ్​ కమిటీని ఏర్పాటు చేసి, నెలరోజుల్లో నివేదిక తెప్పించుకుని ఆపై ఎర్రమంజిల్​ను కూల్చివేసే అవకాశం ఉందని ఆర్​అండ్​బీ అధికారి ఒకరు చెప్పారు.

మరో చోట అసెంబ్లీ నిర్మాణం?

అసెంబ్లీని ఇప్పుడున్న చోటే కొనసాగిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏడాదికి 50 రోజులు జరిగే సమావేశాల కోసం కొత్త బిల్డింగ్​ అవసరంలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్​ మాత్రం ఎలాగైనా కొత్త బిల్డింగ్​ కట్టాల్సిందేనని పట్టుదలగా ఉన్నారని ప్రగతిభవన్​కు దగ్గరగా ఉండే ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. ఎర్రమంజిల్ లో కాకపోతే మరోచోట అసెంబ్లీ బిల్డింగ్​ కట్టే అవకాశం ఉందన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశల వల్ల బిజీగా ఉండడంతో హైకోర్టు తీర్పు కాపీని ఇంకా చదవలేదని ఆర్​అండ్​బీ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి చెప్పారు. జడ్జిమెంట్​కాపీ పూర్తిగా చదివాకే ఏంచేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.

 

TS government is on the look out for what to do with the High Court judgement on Erramanjil.