
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న ఆరోగ్య శ్రీ సేవలు, బీమాపై రోగికి, వాళ్ల సంబంధీకులకు యాజమాన్యం పూర్తిగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని నక్షత్ర ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న వైద్యుల వివరాలు, చార్జెస్ బోర్డులు, కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ వ్యవస్థ, స్కానింగ్, డయాగ్నోస్టిక్ సర్వీసుల ప్రమాణాలు, ఆరోగ్య శ్రీ , ఇతర ఆరోగ్య బీమా సేవలు, డ్రగ్స్ రిజిస్టర్ మెడికల్ నిల్వల నిర్వహణ, పరిశీలించారు.
రోగులకు సంబంధించిన బిల్లును వారికి అందజేయాలని సూచించారు. ధరల పట్టికను రెండు భాషలో పేషెంట్ కి స్పష్టంగా కనబడే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ధరల పట్టిక కంటే అధికంగా బిల్లు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డాక్టర్లు శ్రీధర్, సందీప్ ఐత్వార్, శిల్ప, ఆరోగ్య శ్రీ టీమ్ లీడర్, తదితరులు ఉన్నారు.