మహిళలకు సర్కార్ 3 వేల కోట్లు బాకీ

మహిళలకు సర్కార్ 3 వేల కోట్లు బాకీ
  • రెండున్నరేండ్లుగా డ్వాక్రా లోన్లకు మిత్తి ఇస్తలేదు
  • మూడు నెలలకోసారి చెల్లించాల్సి ఉన్నా పట్టింపులేదు
  • గ్రూపు సభ్యులకు బీమా, వాళ్ల పిల్లలకు స్కాలర్షిప్స్ బంద్
  • సర్కారు తీరుతో గ్రూపుల్లో కొత్తగా ఎవరూ చేరుతలేరు

హైదరాబాద్, వెలుగు:  మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న లోన్లపై బ్యాంకు ఆఫీసర్లు మిత్తీని బరాబర్ వసూలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండున్నరేండ్లుగా ఆ డబ్బులను మహిళలకు తిరిగి చెల్లిస్తలేదు. మహిళలకు వడ్డీ లేని రుణాలు (వీఎల్ఆర్) ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్.. వారి ఖాతాల్లో వడ్డీ డబ్బులను జమ చేస్తలేదు. ఇట్ల ఇప్పటివరకు డ్వాక్రా సంఘాలకు రాష్ట్ర సర్కార్  దాదాపు రూ. 3 వేల కోట్ల దాకా బాకీ పడింది. మహిళా సంఘాల సభ్యులకు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ఆమ్ఆద్మీ బీమా, వాళ్ల పిల్లలకు స్కాలర్షిప్లాంటి బెనిఫిట్స్ను కూడా ప్రభుత్వం ఎత్తేసింది. డ్వాక్రా గ్రూపులను లోన్లు తీసుకోవడం, చెల్లించడం, డబ్బులు పొదుపు చేసుకోవడానికే పరిమితం చేసింది. దీంతో కొత్త గ్రూపుల ఏర్పాటుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నా చేరేందుకు మహిళలు ఆసక్తి చూపడం లేదు.  సెకండ్ టర్మ్లో పట్టింపు లేదు రాష్ట్రవ్యాప్తంగా రూరల్, అర్బన్ ఏరియాల్లో కలిపి 5,80,345 డ్వాక్రా గ్రూపులున్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో 3,99,120 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఇందులో 43,29,058 మంది సభ్యులు ఉన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో 1,81,225 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఇందులో 19  లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఏటా సెర్ప్ పరిధిలోని డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు 12.5 శాతం వడ్డీతో రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 8 వేల కోట్ల వరకు రుణాలు ఇస్తున్నాయి. మెప్మా పరిధిలో సంఘాలకు ఇదే వడ్డీతో రూ. వెయ్యి కోట్ల నుంచి రూ. 1,200 కోట్ల వరకు లోన్లు ఇస్తున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ రుణాలను తీసుకొని.. కిస్తీ, వడ్డీని ఇన్ టైంలో చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ డబ్బులను ప్రభుత్వం మూడు నెలలకోసారి మహిళల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇదే వడ్డీ లేని రుణాల పథకం ఉద్దేశం. కానీ, టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిత్తి డబ్బులు రావడం లేదు. ఈ ఏడాది రూ. 10 వేల కోట్లు రుణాలివ్వాలని సెర్ప్ అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. నెలనెలా క్రమం తప్పకుండా 97 శాతం గ్రూపులు కిస్తీ, మిత్తి చెల్లిస్తుండడం.. డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన లోన్లు తప్ప బ్యాంకులకు మరే ఇతర లోన్లు పెద్దగా రికవరీ కాకపోవడంతో ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఒక్కో గ్రూప్కు  రూ. 10 లక్షల వరకు లోన్ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి.

ఇదీ లెక్క..!

డ్వాక్రా గ్రూపులకు సంబంధించి 2014 నుంచి 2018 వరకు నాలుగేండ్ల మిత్తి బకాయిలు రూ. 1,900 కోట్లను 2018 ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రభుత్వం చెల్లించింది. అయితే.. మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం లేదు. సెర్ప్ పరిధిలోని డ్వాక్రా గ్రూపులకు 2018 – 19లో ఇచ్చిన రూ. 6,200 కోట్లు, 2019–20లో ఇచ్చిన రూ. 6,500 కోట్లు, 2020 – 21లో ఇప్పటివరకు ఇచ్చిన రూ. 8 వేల కోట్ల రుణాలకు బ్యాంకులు విధించిన మిత్తీ దాదాపు రూ. 2,600 కోట్ల దాకా అయింది.మెప్మా పరిధిలోని డ్వాకా గ్రూపులకు 2018 –19లో రూ. వెయ్యి కోట్లు, 2019 – 20లో రూ. 1,100 కోట్లు, 2020 –- 21లో ఇప్పటివరకు రూ.1,200 కోట్లు రుణాలు ఇచ్చారు. వీటికి మరో మిత్తి దాదాపు రూ. 4‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 కోట్ల అయింది. వీటిని ప్రభుత్వం చెల్లించడం లేదు.

లోన్ రూ. 5 లక్షలు దాటితే వడ్డీ కట్‌‌

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఏపీలో 2000లో అప్పటి సీఎం చంద్రబాబు ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మహిళా పొదుపు సంఘాలను ప్రారంభించారు. అప్పట్లో బ్యాంకు మిత్తికే లోన్లు ఇచ్చేవారు. ఆ తర్వాత వైఎస్‌‌‌‌‌‌‌‌ రాజశేఖరరెడ్డి  హయాంలో మహిళా సంఘాలకు పావలా వడ్డీకే  రుణాలిచ్చే పథకాన్ని ప్రారంభించారు. 2010 చివరలో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్కుమార్రెడ్డి.. పావలా వడ్డీని తీసేసి, వడ్డీ లేని రుణాల(వీఎల్ఆర్) స్కీమ్ను ప్రవేశపెట్టారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో డ్వాక్రా గ్రూపులకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించింది. అయితే అధికారం చేపట్టినప్పటి నుంచి.. రూ. 5 లక్షల లోన్ దాటితే వడ్డీ చెల్లించడం లేదు. ఎన్నికల హామీ మేరకు రూ. 10 లక్షల వరకు వడ్డీ రాయితీ వర్తింపజేయాలని డ్వాక్రా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గ్రూపుల్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు

ఒకప్పుడు డ్వాక్రా గ్రూపుల్లో చేరేందుకు పోటీ పడిన మహిళలు.. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపడం లేదు. కొత్త గ్రూపుల ఏర్పాటుకు సెర్ప్ స్పెషల్ డ్రైవ్ చేపట్టినా మహిళలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ఏపీలో ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి ఆమ్ఆద్మీ బీమా వర్తింపజేసేవారు. రూ. 200 బీమా ప్రీమియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 100 చొప్పున భరించేవి. సభ్యురాలు ఎలా మరణించినా రూ. 75 వేలు ఎక్స్గ్రేషియా ఇచ్చేవారు. అలాగే సభ్యురాలి భర్త పేరిట రూ. 150 ప్రీమియం చెల్లిస్తే జనశ్రీ బీమా ఉండేది. భర్త మరణించినా.. రూ. 75 వేలు ఎక్స్ గ్రేషియా అందేది. అలాగే సభ్యుల పిల్లలకు తొమ్మిదో  తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు ఏటా రూ. 1,200 స్కాలర్షిప్ ఇచ్చేవారు. ఏపీలోని డ్వాక్రా సభ్యులకు ఈ సౌకర్యాలు ఇప్పటికీ ‘వైఎస్సార్ బీమా’ పేరిట అమలవుతుండగా.. మన రాష్ట్రంలో మాత్రం ప్రీమియం చెల్లించకపోవడంతో నిలిచిపోయాయి. దీంతో మహిళలు గ్రూపుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు.

 

మహిళలకే రూల్స్.. సర్కార్ కు నో రూల్స్‌‌

లోన్లు తీసుకున్న మహిళలు ప్రతి నెలా కిస్తీని చెల్లించాల్సిన తేదీకి ఒక్క రోజు లేటు కట్టినా ఆ నెల వడ్డీని తాము చెల్లించాల్సిన వడ్డీగా ప్రభుత్వం పరిగణించడం లేదు. ఇన్ టైంలో కిస్తీ చెల్లిస్తేనే ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీగా లెక్కగడుతున్నారు. మహిళల విషయంలో  రూల్స్ను కచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. తాను మాత్రం 3 నెలలకోసారి జమ చేయాల్సిన మిత్తిని ఏండ్లుగా పెండింగ్లో పెడుతోంది.

ఎలక్షన్ టైంలోనే జమ

ఎన్నికలు వస్తేనే ప్రభుత్వానికి మహిళా సంఘాలు గుర్తుకొస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. నాలుగేండ్ల పెండింగ్  వడ్డీని సరిగ్గా 2018లో ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చింది. వడ్డీ మొత్తం ఒకేసారి అకౌంట్లలో వేయడం ద్వారా మహిళల ఓట్లను తమ ఖాతాల్లో వేయించుకోవాలనే ఉద్దేశమే తప్ప.. పథకం అమలులో చిత్తశుద్ధి లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రెండున్నరేండ్లుగా మిత్తి చెల్లించకపోవడంపై మహిళలు భగ్గుమంటున్నారు. తాము టైమ్కు వడ్డీతోపాటు కిస్తీలు కడుతుంటే.. ప్రభుత్వం వడ్డీ వేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఐకేపీ సిబ్బందిని మహిళలు నిలదీస్తే.. 2023 ఎన్నికల వరకు ఆగాల్సిందేనని సమాధానమిస్తున్నారు.

మమ్మల్ని  సర్కార్ గోస పెడుతున్నది

నేను రెండేండ్ల కింద మహిళా సంఘంలో  రూ.50  వేల లోన్ తీసుకున్న. టైమ్కు కిస్తీ కడుతున్నా సర్కారు నుంచి ఇప్పటి వరకు వడ్డీ పైసలు రాలే. మహిళలను గవర్నమెంట్ గోస పెడుతున్నది. ఇప్పటికైనా మా మిత్తి పైసలు మాకియ్యాలె. - పూదరి భారతి, మహిళా సంఘం సభ్యురాలు, కోర్కళ్, కరీంనగర్

త్వరలో వస్తయ్

ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణాల టార్గెట్  పూర్తి చేశాం. అయితే రెండేండ్లుగా మహిళా సంఘాలు కడుతున్న వడ్డీలు పెండింగ్‍లో ఉన్నాయి. ఇట్ల నిర్మల్ జిల్లాలో సుమారు రూ. 20 కోట్ల వరకు ఉంటాయి. త్వరలో ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.  -వెంకటేశ్వర్లు, డీఆర్‍డీఓ, నిర్మల్.

మిత్తి పైసలిస్తే ఆసరైతది

నెలానెలా టైంకు బ్యాంకులో కిస్తీలు కడుతున్నం. అయినా సర్కార్ మాత్రం వడ్డీ ఇస్తలేదు. సర్కారు స్పందించి ఎప్పటికప్పుడు మిత్తీ పైసలు ఇస్తే మాకు ఆసరైతది. -తిరుబాయి, గోకుండ,బజార్‍హత్నూర్‍, ఆదిలాబాద్ జిల్లా

సర్కారు నుంచి పైసా వస్త లేదు

మా నర్సాపూర్ మండలం పరిధిలో 278  గ్రూపులకు బ్యాంకు నుంచి రూ.12.80 కోట్ల రుణాలు అందినయ్.  కిస్తీలు కరెక్టుగా కడుతున్నా.. సర్కారు నుంచి పైసా వస్త లేదు.  -రాజమణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు, నర్సాపూర్ (జి), నిర్మల్ జిల్లా.

వడ్డీ ఎక్కువైంది

బ్యాంక్ నుంచి 7 లక్షలు లోన్  తీసుకున్నం. కానీ గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బులు రాక వడ్డీ ఎక్కువైపోయింది. తొందరగా గవర్నమెంట్ డబ్బులు పంపిస్తే మాకు భారం తగ్గుతది. -శివరాత్రి  అంజమ్మ, మల్లాపూర్, నిర్మల్ జిల్లా.

గిట్ల చేస్తున్నరేంది

మహిళ సంఘాలకు వడ్డీ లేని లోన్లు ఇచ్చి స్వయం ఉపాధికి ప్రోత్సహిస్తామని ఎన్నికల ముందు  చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు వడ్డీతో పాటు వసూలు చేస్తోంది.   సంఘ సభ్యులు వడ్డీతోపాటు కిస్తీలు కట్టాల్సిందే అని  వసూలు చేస్తున్నారు. -తౌటు పుష్ప, చొప్పదండి, కరీంనగర్.