
- మిగిలిన ధాన్యం ఎఫ్‌సీఐ కోటాలో కొని.. చేతులు దులుపుకునే ప్రయత్నం
- అందుకే కొనుగోలు సెంటర్ల ఓపెనింగ్‌లో తీవ్ర జాప్యం
- గత నెల 16న కొనుగోళ్లు స్టార్ట్ చేయాలని ఉత్తర్వులు
- ఆదేశాలిచ్చి 23 రోజులు.. 30 శాతం సెంటర్లే ఖుల్లా
- రైతులను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల నుంచి తప్పుకునేందుకు ప్లాన్ వేసింది. అందులో భాగంగానే కొనుగోలు సెంటర్ల ఏర్పాటులో లేట్ చేస్తున్నది. ప్రస్తుతం 40 లక్షల టన్నుల వడ్లు అమ్మేందుకు రైతుల దగ్గర రెడీగా ఉన్నా.. ఇప్పటివరకు 30 శాతం కొనుగోలు సెంటర్లనే రాష్ట్ర సర్కారు ఓపెన్ చేసింది. కొన్ని చోట్లయితే ఒక్క సెంటర్ కూడా ఓపెన్ కాలేదు. దీంతో రైతులు చేసేది లేక మిల్లర్లు, దళారుల చుట్టూ తిరుగుతున్నారు. అడ్డికి పావుసేరుకు వడ్లను అమ్ముకొని నష్టపోతున్నారు. ఇట్లా మొత్తం పంటలో సగం మిల్లర్లకు, దళారులకు చేరిన తర్వాత పూర్తిస్థాయిలో కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి.. మిగిలిన సగం వడ్లను ఎఫ్‌సీఐ కోటాలో కొని మమ అనిపించాలని రాష్ట్ర సర్కారు చూస్తున్నది.
ఓపెన్ చేసిన ఆ కొద్ది సెంటర్లలోనూ ఎప్పటికప్పుడు కొనుగోళ్లు జరగడం లేదు. టోకెన్ల పేరిట రైతులను రోజులకు రోజులు తిప్పించుకుంటున్నారు. అలా తిప్పిచ్చుకోవడంతో ఓపిక నశించి రైతులు మిల్లర్లను ఆశ్రయించి.. తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్మేసుకుంటున్నారు. దీని వెనుక కూడా రాష్ట్ర సర్కారు ఎత్తుగడ ఉందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సర్కారుకు కొనాలనే ఉద్దేశం ఉంటే పూర్తి స్థాయిలో సెంటర్లను ఎందుకు తెరవడం లేదని, తెరిచిన కొన్ని సెంటర్లలోనూ ఎప్పటికప్పుడు ఎందుకు కొనడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
పోయిన నెలలో వెంటనే కొనుగోళ్లు అన్నరు
హుజూరాబాద్ బై పోల్ నామినేషన్లు ముగిసిన తర్వాత గత నెల 16న వడ్ల కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని, 6,575 కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు ఇచ్చి ఇంకో నాలుగు రోజులైతే నెల అవుతుంది. ఇప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఎక్కడా పెద్దగా జరగడం లేదు. ఆఫీసర్లు చెప్తున్న దాని ప్రకారమే ఇప్పుడు 40 లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర అమ్మకానికి రెడీ గా ఉంది. ఇప్పటి వరకు ఓపెన్ చేసిన సెంటర్లు 2,142 మాత్రమే. సేకరించిన వడ్లు 2.36 లక్షల టన్నులే. వానాకాలం సీజన్లో కోటిన్నర టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. 60 లక్షల టన్నుల వడ్లు కొంటామని ఇప్పటికే ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. అయితే మిగిలిన దానిని రాష్ట్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనిని నుంచి తప్పించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కొనుగోలు సెంటర్లను లేట్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇట్లా ఆలస్యం చేస్తే చాలా మంది రైతులు మిల్లర్లకు, దళారులకు వడ్లు అమ్ముకుంటారు. ఆ తర్వాత తీరిగ్గా సెంటర్లను ఓపెన్ చేస్తే అమ్మకానికి తక్కువ ధాన్యం వస్తుంది. ఆ వచ్చేదానిని ఎఫ్‌సీఐ కోటాలో కొంటే సరిపోతుందనే ఉద్దేశంలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ సెంటర్లు లేకపోవడంతో మిల్లర్లకు, దళారులకు తక్కువ ధరకే రైతులు అమ్ముకుంటున్నారు. కల్లాల్లో వడ్లను అట్లనే ఉంచితే ఎప్పుడు వాన పడి తడిసిపోతాయోనన్న భయంతో మిల్లర్లకు ఇచ్చేస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు దోచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రేడ్– ఎ రకానికిక్వింటాల్కు ఎంఎస్పీ రూ. 1,960, సాధారణ రకానికి రూ. 1,940 ప్రకటించింది. అయితే మిల్లర్లు, దళారులు మాత్రం క్వింటాల్‌కు రూ. 1,400 లోపే చెల్లిస్తున్నారు.
దిగుబడిపై పూటకో లెక్క చెప్తూ..!
పునాస వరి దిగుబడిపై రాష్ట్ర సర్కారు పూటకో లెక్కను మారుస్తున్నది. ముందు 52 లక్షల ఎకరాల్లో, కోటి 37 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అందుకు తగ్గట్టుగా అన్ని రాష్ట్రాల నుంచి సేకరించే దాని ప్రకారం తెలంగాణ నుంచి 60 లక్షల టన్నులు తీసుకుంటామని కేంద్రం చెప్పింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ లెక్కను మార్చింది. మరో 26 లక్షల టన్నులు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 61.55 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, కోటి 63 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని పేర్కొంది. కోటి 30 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రమే తీసుకోవాలని ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లెటర్ రాసింది. దీంతో కొనుగోలు చేసే మొత్తాన్ని ఎఫ్‌సీఐ పెంచితే, ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని రాష్ట్ర సర్కారు చూస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. గతంలో చివరి గింజ వరకు కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, అదంతా ఎఫ్‌సీఐ కోటాలోనే కొనుగోలు చేసింది. దాన్ని రాష్ట్రమే కొనుగోలు చేసినట్లు చెప్పింది.
కేంద్రం చెప్పిందొకటి.. రాష్ట్రం చెప్పేదొకటి..!
వాస్తవానికి యాసంగి నుంచి పారా బాయిల్డ్ రైస్ ఏ రాష్ట్రం నుంచి కూడా తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఫైన్ వెరైటీలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని, ఆ మేరకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. అయితే దీన్ని రాష్ట్ర సర్కారు వేరేలా ప్రచారం చేస్తున్నది. వడ్లను కేంద్రం కొనబోమంటోందని, యాసంగి నుంచి వరి వేసుకోవద్దని రాష్ట్ర సర్కారు చెప్తూ వస్తున్నది.
32 ఊర్లకు 50 టోకెన్లే!
వడ్లు అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలోని అగ్రికల్చర్ ఆఫీస్ వద్ద టోకెన్ల కోసం ఇలా తెల్లవారుజాము నుంచే లైన్లో పాస్ బుక్కులు పెట్టి గంటల తరబడి ఎదురు చూశారు. 32 గ్రామ పంచాయతీలు, దాదాపు 15 వేల ఎకరాల్లో వరి పండే మండలంలో రోజుకు 50 టోకెన్లే ఇస్తే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 500 టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇరవై రోజులుగా పడిగాపులు
వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చి ఇరవై రోజులైంది. ఇంతవరకు మందలిచ్చినోళ్లు లేరు. ఇంటికాడి పనులన్నీ వదులుకుని వడ్ల కుప్పకాడనే కూసుంటున్నం. ఆఫీసర్లను అడిగితే రేపు మాపు అంటున్నరు. ఎప్పుడు కొంటరో కూడా కచ్చితంగా చెప్తలేరు. వడ్లు ఎండకు ఎండుతున్నయ్.. వానకు తడుస్తున్నయ్. కుప్పలకు కాపలా కాయలేక పోతున్నం. తెచ్చిన వడ్లను కొనడానికి ఇబ్బంది ఏందో అర్థం కావట్లే. ధాన్యం తెచ్చిన రైతులందరి పరిస్థితీ ఇదే.
‑ రాములు, వెంకటేశ్వరపల్లి, సిద్దిపేట జిల్లా
వెంటనే సెంటర్లన్నీ తెరవాలి
కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నది. రెండు నెలల నుంచి వరిపై పూటకో మాట మాట్లాడుతున్నది. మస్తు వరి సాగైందని చెప్పుడు తప్పిస్తే.. వచ్చే దిగుబడిని కొనేందుకు మాత్రం ముందుకు వస్తలేదు. రైతులు నష్టపోవద్దంటే అన్ని కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించి వడ్లు కొనాలి.
- దొంతి నర్సింహారెడ్డి, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్