వరి కొనకపోతే.. రైతుకు గోసే!

V6 Velugu Posted on Sep 23, 2021

ఈసారి వానాకాలం వరి పంటను కొనలేమని, వరిని మానుకుని ఇతర పంటలు వేయాలని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంటను ఎఫ్ సీఐ లేదా సివిల్ సప్లయ్స్/ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేయకపోతే మిల్లర్లు కనీస మద్దతు ధరలో 60 శాతం కూడా ఇవ్వకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం రూ.1940 కనీస మద్దతు ధర ప్రకటించగా.. మిల్లర్లు రూ.1,200 నుంచి 1,300 మాత్రమే ఇచ్చే పరిస్థితి దాపురించబోతున్నది. ఎకరా వరి పెట్టుబడి గత ఏడాది రూ.35 వేల నుంచి రూ.41 వేల వరకూ కాగా ఈ సంవత్సరం మరో రూ.5,000 పెరిగింది. ఇలాంటి స్థితిలో మిల్లర్లు రైతులను దోపిడీ చేయకుండా ప్రభుత్వ సంస్థలే పంటలు కొనాలి.

రాష్ట్ర ప్రభుత్వం  2020–21 యాసంగిలో మొదట వడ్లు కొనుగోలు చేయలేమని చెప్పింది. అయితే ఎఫ్​సీఐ తీసుకుంటానికి ఆమోదం తెలపడంతో 6,300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 94 లక్షల టన్నుల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. ఇందుకోసం బ్యాంకుల నుంచి పెట్టుబడి రుణంగా రూ. 20 వేల కోట్లను తీసుకుంది. అయితే కొనుగోలు చేసిన వడ్ల నుంచి 60 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఇస్తామని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. అయితే కేంద్రం 24.6 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్​ తీసుకుంటామని, మిగిలినవి ముడి బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. యాసంగిలో ఎండలు బాగా ఉండడం వల్ల వడ్లను ముడి బియ్యంగా మార్చినప్పుడు 25 శాతం బియ్యపు గింజలు విరిగి నూకగా మారతాయి. అందువల్ల ఉప్పుడు బియ్యంగా మారితే 66 లక్షల టన్నులు ఇస్తామని మిల్లర్లు చెప్పారు. అయితే కేంద్రాన్ని ఉప్పుడు బియ్యం కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించలేకపోతున్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడి రుణానికి అదనంగా రైతులకు ఇప్పటికీ చెల్లించాల్సిన బకాయిలున్నాయి. అందువల్ల ఎఫ్​సీఐ కొనుగోలు చేయకపోతే తాము ఏమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తున్నది. వచ్చే వానాకాలం వడ్లను కేంద్రం కొనుగోలు చేస్తుందనే నమ్మకం కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం తాము వరి పంటను కొనలేమని చెబుతోంది. మరో రెండు నెలల్లో పంట చేతికి వస్తుందనగా ఇప్పుడు వరి కొనలేమని చెప్పడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది.
కేంద్రం విధానమేమిటి?
కేంద్రం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మాత్రమే బియ్యాన్ని సేకరిస్తున్నది. మిగతా రాష్ట్రాలు తమ వరకు పండించుకోవడమో లేక లోటు ఉండటమో జరుగుతున్నది. రాష్ట్రాల చౌక డిపోలకు ఎఫ్​సీఐ ద్వారా ఇంతకాలం బియ్యం సరఫరా చేస్తూ వస్తున్నారు. ఎఫ్ సీఐని ఎత్తేసి అన్ని రాష్ట్రాలకు నగదు సబ్సిడీ ఇవ్వడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. అందువల్ల ఆ సబ్సిడీ తీసుకొని రాష్ట్రాలే బియ్యం, గోధుమలను కొనుగోలు చేసుకోవాలి. లేదా చౌక డిపో లబ్ధిదారులకు కేంద్రం ఇచ్చే నగదును బదిలీ చేయాల్సి ఉంటుంది. నగదు ఇచ్చినప్పుడు కేంద్రం ఇచ్చే రేటుకు మార్కెట్ లో బియ్యం దొరకవు. ప్రస్తుతం కిలో బియ్యానికి కేంద్రం రూ.29.73 సబ్సిడీ ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రూ.2, కార్డు హోల్డర్ ఒక రూపాయి దీనికి కలిపి మొత్తం రూ.32.73కు మిల్లర్ల నుంచి కొనుగోలు జరుగుతున్నది. నగదుగా మారడం వల్ల కార్డు హోల్డర్​కు రూ.30కి కిలో బియ్యం రావు. అదనంగా రూ.10 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్రం తెలంగాణకు 53.30 లక్షల కార్డులను అనుమతించింది. రాష్ట్రం అదనంగా 34.25 లక్షల కార్డులను ఇవ్వగా, మొత్తం 87.55 కార్డులు ఉన్నాయి. కేంద్రం మనిషికి 5 కిలోలు ఇస్తుండగా, రాష్ట్రం 1 కిలో అదనంగా ఇస్తున్నది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా 18.36 లక్షల టన్నుల వడ్లను చౌక డిపోలకు కొనుగోలు చేసి ఇవ్వాలి. లేదా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలి. ఎకనమిక్ సర్వే ప్రకారం ఎఫ్​సీఐ 2021 సంవత్సరానికి 30.34 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించింది. ఇందులో బియ్యం 12.14 కోట్ల టన్నులు, గోధుమలు 10.92 కోట్ల టన్నులు, ముతక ధాన్యాలు 4.94 కోట్ల టన్నులు, పప్పులు 2.44 కోట్ల టన్నులు. 2019-–20లో 29.75 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. అంటే 0.59 కోట్ల టన్నులు మాత్రమే అదనంగా ఉత్పత్తి జరిగింది. తెలంగాణలో జరిగిన అదనపు ఉత్పత్తి 30 లక్షల టన్నులు ఇందులో కలిసి ఉంది. అందువల్ల అదనపు ఉత్పత్తి జరిగినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 
రైతుబంధు, రుణమాఫీతో సమస్య పరిష్కారం కాదు
కేరళ, ఆంధ్రప్రదేశ్ కూరగాయలకు కూడా మద్దతు ధర నిర్ణయించి అమలు చేస్తున్నాయి. ప్రతి రాష్ట్రం తమ అవసరాల మేరకు ఉత్పత్తి చేసుకోడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. తెలంగాణలోని భూముల్లో ఏ పంటలు పండించాలో ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు ఈ నాలుగు పంటలనే ప్రభుత్వం గుర్తిస్తున్నది. ముఖ్యమంత్రి ఒక్కోసారి ఒక్కో పంటను ప్రోత్సహిస్తున్నారు. ధర లేనప్పుడు తగ్గించమని చెపుతున్నారు. ఇప్పుడు వరి వేయొద్దని చెప్పడం కూడా అందులో భాగమే. ఇటీవల వరి బాగా పండిందని రాష్ట్ర ప్రభుత్వం సంతోషపడింది. కోటి ఎకరాలను మాగాణి చేస్తానని గతంలో సీఎం ప్రకటించారు. మాగాణిలో వరి తప్ప ఏ పంట పండుతుంది? 11 చెరుకు మిల్లులలో 4 మూసేశారు. లక్ష ఎకరాల్లో వేసే చెరుకు 50 వేల ఎకరాలకు తగ్గింది. ఏ పంట వేసినా మార్కెట్ కీలకం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రణాళికలను రూపొందించుకోవాలి. పత్తి, వరికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. విత్తనాల లాగే ఎగుమతి రాయితీలు ఇచ్చి ఎగుమతులు చేయాలి. రైతులను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రైతుబంధు, రుణమాఫీ ప్రకటించడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. రైతులు ప్రభుత్వం నుంచి పొందిన పథకాలకన్నా ఎక్కువ నష్టపోతున్నారు. అందువల్ల వరిని పండించకూడదనే ప్రచారాన్ని మాని రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పంటలు పండించాలి.

మార్కెట్​ యార్డుల్లో రైతు నష్టపోతే బాధ్యత ఎవరిది?
రాష్ట్ర అవసరాల మేరకు ఉత్పత్తి చేయడంతోపాటు ఏ భూమిలో ఏ పంట పండుతుందో స్పష్టమైన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. వాటిని ప్రాసెస్ చేసి మార్కెటింగ్ కు అనుకూలంగా మార్చే యంత్రాంగాన్ని రూపొందించాలి. వ్యవసాయ, సివిల్ సప్లయ్, మార్కెటింగ్ శాఖలు కలిసి రైతుల పంటలను కొనుగోలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 22.4 లక్షల టన్నులకు సరిపడా గోడౌన్లు మాత్రమే ఉన్నాయి. డ్రయ్యర్స్, టార్పాలిన్లు, సిమెంట్ ప్లాట్ ఫాంలు, ఎలక్ట్రానిక్ వే మిషన్లు, ఓపెన్ క్యాప్ రక్షణలు, గన్ని బ్యాగుల నిల్వలు, ఫ్యూమిగేషన్ సౌకర్యం ఇలాంటివి మన మార్కెట్లలో లేవు. మార్కెట్ యార్డ్​కు వచ్చిన సరుకు వర్షాల వల్ల నష్టపోయింది వందల కోట్లలో ఉంటోంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి. రైతు ఇంటి వద్ద నష్టపోతే రైతు భరిస్తాడు. కానీ మార్కెట్ యార్డ్ లో నష్టపోతే మార్కెట్ కమిటీ భరించాలి. కానీ ముందుచూపుతో మార్కెట్ వ్యవస్థను తయారు చేయడంలో ప్రభుత్వ శాఖలు నిద్రమత్తులో ఉన్నాయి. అలాగే వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలు మన అవసరాల మేరకు పంటలు పండించడానికి ప్రణాళికలు రూపొందించాలి. సేకరించిన ధాన్యం నుంచి మిల్లర్లు ఎఫ్ సీఐకి పంపడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.4,500 కోట్లు నష్టపోయినట్లు గతంలో ప్రకటించింది. అందువల్ల రానున్న కాలంలో నష్టపోకుండా ఉండాలంటే కేంద్రం కొనుగోలు చేసే హామీ ఉంటేనే వడ్లు కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

దిగుమతులపైనే ఆధారపడుతున్నం
రాష్ట్రంలో వరి, మిరప, పసుపు మినహా మిగిలిన పంటలన్నీ లోటుగానే ఉన్నాయి. వాటిని ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులను తగ్గించాలంటే స్థానికంగా మనం ఉత్పత్తుల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ ప్రణాళిక లేకపోవడంతో రైతులు ప్రణాళికాబద్ధం కాని విధంగా పంటలు వేస్తున్నారు. ఏ పంటకు ధర ఉంటే ఆ పంట వేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ ప్రణాళిక 20 ఏండ్లుగా వస్తున్న దానినే ప్రతి యేటా జూన్ చివరలో లేదా జులై మధ్యలో విడుదల చేస్తున్నారు. మేలో ప్రకటించాల్సిన రుణ ప్రణాళికను.. చివరికి జూన్ ముగింపులో ప్రకటిస్తున్నారు. ఏ భూమిలో ఏ పంట వేయాలో వ్యవసాయ శాఖ ఏనాడూ రైతులకు చెప్పలేదు. ముఖ్యమంత్రి గుంaడుగుత్తగా 60 లక్షల ఎకరాల్లో పత్తి, 60 లక్షల ఎకరాల్లో వరి వేయాలని చెప్పారు. తర్వాత పత్తి కొనుగోలు లేనప్పుడు మొక్కజొన్న వేయమని చెప్పారు. 7 లక్షల నుంచి 11 లక్షల విస్తీర్ణం పెరిగింది. మొక్కజొన్నల కొనుగోలు లేకపోవడంతో కందులు వేయమని ప్రకటించారు. తీరా కందులు వేస్తే మార్కెట్లో కనీస మద్దతు ధర అమలు కాకుండా పోయింది.

Tagged farmer, crop, TS Govt, difficulties,

Latest Videos

Subscribe Now

More News