స్కీమ్‌‌లకు  ఓటర్‌‌‌‌ కార్డు .. గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్న ఆఫీసర్లు

స్కీమ్‌‌లకు  ఓటర్‌‌‌‌ కార్డు .. గృహలక్ష్మి, దళితబంధు  లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్న ఆఫీసర్లు
  • జీవోల్లో, మార్గదర్శకాల్లో లేకపోయినా ఓటర్ ఐడీ తప్పనిసరట
  • లేకపోతే పథకం రాదంటూ పేర్లను హోల్డ్‌‌లో పెడ్తున్నరు

హైదరాబాద్, వెలుగు:  స్కీముల్లో లబ్ధిదారులుగా చేర్చేందుకు ఓటర్‌‌‌‌ ఐడీ కార్డును రాష్ట్ర సర్కార్ తప్పనిసరి చేస్తున్నది. మార్గదర్శకాల్లో, జీవోల్లో ఎక్కడా ఓటరు ఐడీ కార్డు గురించి ప్రస్తావించని ప్రభుత్వం.. లబ్ధిదారులుగా గుర్తించేందుకు మాత్రం ఐడీని తీసుకురావాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. సాధారణంగా రేషన్ కార్డును ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, స్కీమ్ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఫైనల్ చేస్తారు. అయితే ఇప్పుడు దళితబంధు, గృహలక్ష్మి, బీసీలకు రూ.లక్ష సాయం పథకాలకు ఓటరు ఐడీలను ఇవ్వాల్సిందేనని అధికారులు తేల్చిచెబుతున్నారు. లేదంటే తుది జాబితాలో పేరు ఉండదని, దానికి తమను బాధ్యులను చేయొద్దని ముందే చెప్పేస్తున్నారు. ప్రభుత్వ గైడ్​లైన్స్ ప్రకారం అన్ని సర్టిఫికెట్లు ఇచ్చామని, ఓటరు కార్డు ఎందుకు అని అడిగితే తమకేం తెల్వదని, తమకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారని లబ్ధిదారులు అంటున్నారు. నెల రోజులుగా ప్రభుత్వం నుంచి స్కీమ్​లు అందుకుంటున్న.. లబ్ధిదారుల నుంచి ఓటరు ఐడీ కార్డులను ఆఫీసర్లు తీసుకుంటున్నారు. ఒకవేళ ఓటరు కార్డు లేకుంటే.. పథకానికి హోల్డ్‌‌‌‌లో పెడుతున్నారు.

ఎలక్షన్ల కోసమేనా?

గృహలక్ష్మి పథకానికి అర్హులైన వారి నుంచి ఇటీవల అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దాంట్లో ఆధార్ కార్డు, సంబంధిత భూమి పత్రాలు, ఓటరు ఐడీ కార్డు నంబర్ తదితర వివరాలు అడిగారు. అయితే అప్పుడు ఓటరు కార్డును ఆప్షనల్‌‌‌‌గా చెప్పారు. తర్వాత అప్లికేషన్లపై పంచాయతీ సెక్రటరీలతో ఫీల్డ్ ఎంక్వైరీ చేయించారు. ఓటరు కార్డును జత చేయని వాళ్లకు ఫోన్లు చేసి మరీ తెప్పించుకున్నారు. ఓటరు కార్డు లేదని చెప్పిన వాళ్ల దరఖాస్తులను హోల్డ్‌‌‌‌లో పెడుతున్నట్లు చెప్పారు. ఆధార్, రేషన్ కార్డు, ఇతర అన్ని వివరాలు ఇచ్చాము కదా అని అడిగితే.. అదంతా తమకు తెల్వదని, ఓటరు ఐడీ కార్డు తీసుకురావాల్సిందేనని సెక్రటరీలు స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేల దగ్గరకు ఎవరైనా వెళ్తే.. ‘ఓటే లేదు.. స్కీం ఎట్లా ఇస్తం’ అని అంటున్నట్లు కొందరు వాపోతున్నారు. ఇక నేరుగా దళితబంధు నియోజకవర్గానికి 1,100 మంది లబ్ధిదారుల లిస్టును ఎమ్మెల్యేలే ఫైనల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు కూడా దళితబంధు కోసం జాబితాలో పేరు పెట్టిన వారి ఓటరు ఐడీ కార్డు వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే లిస్టును ఫైనల్ చేస్తున్నారు. ఇదంతా ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక ఇంటికి ఏ స్కీమ్​ అందినా వారి ఓటరు వివరాలు తీసుకోవడం.. దాని ఆధారంగా కుటుంబంలో ఉన్న ఓటర్లందరి వివరాలు తీసుకుని, ఎవరి ఇంటికి ఏ పథకం అందిదో చెప్పి ఓట్లు వేయించుకోవడానికే ఇలా ప్లాన్​ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

పాత పథకాలకూ అడుగుతున్నరు

రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందటి వరకు ఏ పథకానికీ ఓటరు కార్డు వివరాలు సేకరించలేదు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో పథకాలను స్పీడప్ చేసింది. రుణమాఫీ, దళితబంధు, గృహలక్ష్మి, బీసీలు, మైనార్టీలకు రూ.లక్ష సాయం వంటివి పట్టాలు ఎక్కించింది. మొదటి ఫేజ్‌‌‌‌లో అమలు చేసిన దళితబంధు స్కీంలో ఓటరు ఐడీ ప్రస్తావన తీసుకురాలేదు. ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే.. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబలందరికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు ఓటరు ఐడీ తీసుకువస్తేనే స్కీం వస్తుందని అంటున్నారు. గృహలక్ష్మికి ఇచ్చిన జీవో, మార్గదర్శకాల్లోనూ ఓటరు గుర్తింపు కార్డు గురించి ఎక్కడా పేర్కొనలేదు. కానీ అప్లికేషన్లు తీసుకునేటప్పుడు.. లబ్ధిదారుల లిస్టును ఫైనల్ చేసేందుకు ఓటరు ఐడీ కార్డు నంబర్ తప్పనిసరిగా చేశారు. జాబితాలో నియోజకవర్గం, మండలం, గ్రామం, పేరు, ఫోన్ నంబర్, కులం, ఫుడ్ సెక్యురిటీ కార్డుతో పాటు ఓటరు ఐడీ నంబర్ కూడా నమోదు చేసి.. ఎమ్మెల్యేలకు పంపుతున్నారు. బీసీల్లో చేతివృత్తులకు, మైనార్టీలకు ఇస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయంలోనూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారు. వీటికే కాకుండా ఎప్పటి నుంచో అమలవుతున్న కల్యాణలక్ష్మి, ఆసరా లబ్ధిదారులను కూడా ఓటరు కార్డులు ఇచ్చి వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడు లేనిది ప్రభుత్వం ఓటరు కార్డులను ఎందుకు అడుగుతున్నారనే దానికి ‘పై నుంచి ఆదేశాలు’ అని చెప్పడమే తప్ప అధికారుల నుంచి ఇంకేలాంటి సమాధానం రావడం లేదు.