సమ్మె ఆపితే ఎట్లజేద్దాం : సర్కారు ఆలోచనలో ఆప్షన్స్​

సమ్మె ఆపితే ఎట్లజేద్దాం : సర్కారు ఆలోచనలో ఆప్షన్స్​
  1. షరతులు లేకుండా కార్మికులను చేర్చుకోవడం
  2. లేబర్​ కోర్టు తీర్పు వచ్చేదాకా వేచి ఉండడం
  3. కఠిన షరతులు పెట్టి అనుమతించడం

షరతులివి?

విలీనం డిమాండ్ శాశ్వతంగా వదులుకోవాలనడం
కొన్నేండ్ల పాటు సమ్మె చేయబోమని రాసివ్వాలనడం

సమ్మె కాలానికి జీతం ఉండదు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలన్న దానిపై సర్కారు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కార్మికులను ఎట్లా డ్యూటీలో చేర్చుకోవాలె, ఏమేం కండిషన్లు పెట్టాలన్న దానిపై ఆలోచన చేస్తోందని.. లేబర్​ కోర్టు విచారణ, తీర్పు ఎట్లా ఉంటుందన్నది అంచనా వేస్తోందని సమాచారం. లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అన్న దానిపై తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తోంది. కార్మికులు సమ్మెకు వెళ్లడంపై ఇప్పటికీ సీఎం సీరియస్ గా ఉన్నారని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 2న జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్​ ప్రెస్​మీట్​ పెట్టి.. ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో చేరేందుకు లాస్ట్ చాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు. డిపోలకు వెళ్లి చేరుతామంటూ లేఖలు ఇవ్వాలని చెప్పారు. కానీ కార్మికులు ముందుకు రాలేదు.

అలాంటిది ఇప్పుడు కార్మికులే స్వచ్ఛందంగా డ్యూటీలో చేరేందుకు వస్తే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, కండిషన్లకు ఒప్పుకునేవారినే చేర్చుకోవాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చిందని సమాచారం. షరతులకు ఒప్పుకోని కార్మికుల విషయంలో లేబర్ కోర్టు తీర్పు ఆధారంగా ముందుకెళ్లే అవకాశం ఉందని తెలిసింది. డ్యూటీలో చేరిన కార్మికులకు వీఆర్ఎస్ ఆప్షన్ ఇవ్వాలని కూడా భావిస్తోందని, ప్యాకేజీ ప్రకటించి మెజారిటీ కార్మికులను బయటకి పంపించాలన్న ఆలోచన చేస్తోందని సమాచారం. బేషరతుగా చేర్చుకుంటరా? సమ్మె విరమిస్తే కార్మికులను బేషరతుగా డ్యూటీలోకి తీసుకునే అవకాశముందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.

డ్యూటీలో చేరాలంటూ సీఎం కేసీఆర్ మూడు సార్లు డెడ్ లైన్ ఇచ్చారు. కానీ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని పట్టుబట్టారు. మొత్తంగా 300 మందిలోపు కార్మికులు మాత్రమే డ్యూటీలో చేరుతామంటూ లెటర్లు ఇచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్​ ఆగ్రహంగా ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. రాజకీయ పార్టీల మాటలు విని కార్మికులు సమ్మెను కొనసాగించారని సీఎం కోపంలో ఉన్నారని అంటున్నాయి. ‘‘మూడు సార్లు టైం ఇచ్చినం. అయినా కార్మికులు డ్యూటీలో చేరలేదు. సీఎం మాటనే వాళ్లు వినలేదు. అంత వాళ్ల ఖర్మ’’ అని ఈ మధ్య సీఎం అన్నట్టు ఓ అధికారి చెప్పారు. సమ్మె చాలా దూరం వెళ్లిందని, ఇంత జరిగాక సీఎం ఎలాంటి షరతులు లేకుండా డ్యూటీలోకి చేర్చుకునే అవకాశం లేనట్టేనని అభిప్రాయపడ్డారు.

విలీనం అడగొద్దు.. సమ్మె చేయొద్దు

ఆర్టీసీ, సర్కారు విధించే షరతుల్లో ప్రధానమైనది విలీనం అంశమే కానుంది. సంస్థను సర్కారులో విలీనం చేయాలని అడగకూడదని, కార్మికులు ఆ డిమాండ్ ను శాశ్వతంగా వదులుకోవాల్సి ఉంటుందన్నది కీలక షరతు అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో కార్మికుల నుంచి మళ్లీ ఈ డిమాండ్​ రాకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తపడాలని సర్కారు భావిస్తోందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ‘‘ప్రతి కార్మికుడు సంతకం చేసే పేపర్ లో.. విలీనం చేయాలని ఎప్పుడూ అడగబోమనేది మొదటి షరతుగా ఉంటుంది”అని ఓ ఉన్నతాధికారి వివరించారు. అదే సమయంలో మరో కీలక షరతు పెట్టాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కార్మికులు సమ్మె బాట పట్టకుండా, ఓ నిర్దిష్ట కాలం పాటు సమ్మె చేయబోమంటూ స్వయంగా ఒప్పుకునేలా షరతు విధించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అయితే ఎన్నేండ్ల పాటు సమ్మె నిషేధానికి రూల్​ పెట్టాలన్న దానిపై అధికారుల్లో ఇంకా క్లారిటీ రాలేదని తెలిసింది.

నో వర్క్.. నో పే!

సమ్మె కాలానికి జీతం అడగవద్దన్న షరతును కార్మికులంతా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. కార్మికుల సమ్మెతో మరింత నష్టాల ఊబిలోకి వెళ్లిందని సర్కారు చెప్తోంది. ఇట్లాంటి సమయంలో 46 రోజుల సమ్మె కాలానికి సంస్థ జీతం చెల్లించే పరిస్థితి లేదని అధికారులు చెపుతున్నారు. డ్యూటీలోకి చేరే కార్మికులు జీతం అడగవద్దని షరుత కూడా విధించే చాన్స్ ఉంది.

లేబర్ కోర్టు తీర్పు దాకా వెయిటింగ్

హైకోర్టు ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు అప్పగించింది. సమ్మె చట్టవిరుద్ధమని ఆర్టీసీ మేనేజ్​మెంట్, సర్కారు హైకోర్టులో బలంగా వాదించాయి. కార్మికుల సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరాయి. కానీ హైకోర్టు అదేమీ చెప్పకుండా కేసును లేబర్ కోర్టుకు పంపింది. దాంతో ఇప్పుడు లేబర్ కోర్టు ఏం చెప్తుందన్నది దానిపై ఉత్కంఠ నెలకొంది. కార్మికులకు ఉన్న హక్కుల మేరకు ముందస్తు నోటీసు ఇచ్చే సమ్మెకు వెళ్లామని ఆర్టీసీ యూనియన్లు చెప్తున్నాయి. లేబర్​కోర్టులోనూ ఇదే వాదన గట్టిగా వినిపించేందుకు సిద్ధమయ్యాయి. అయితే సమ్మె చట్టవిరుద్ధమంటూ లేబర్​ డిపార్ట్​మెంట్​ ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇప్పుడు రెండు వారాల్లోగా మళ్లీ కన్సీలియేషన్​ ప్రక్రియ జరిపి లేబర్​ కమిషనర్​ సర్కారుకు రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ప్రభుత్వం ఈ అంశాన్ని లేబర్​కోర్టుకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంటే.. అక్కడ విచారణ జరుగుతుంది. ఈ లెక్కన లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా కూడా కార్మికులను చేర్చుకునే విషయాన్ని పక్కనపెట్టాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.

కండిషన్స్ పెట్టి డ్యూటీలోకి..

కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించినా సర్కారు మాత్రం కండిషన్లు పెట్టాలని భావిస్తోంది. అవి కూడా సాధారణంగా కాకుండా సీరియస్ కండిషన్లు పెట్టే అవకాశమున్నట్టు సమాచారం. ఆర్టీసీని సర్కారులో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో కార్మికులు సమ్మెకు వెళ్లారు. భవిష్యత్తులో ఎప్పుడూ ఈ డిమాండ్​ లేవనెత్తకుండా షరతు పెట్టే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ‘‘కార్మికులంతా షరతులను లిఖిత పూర్వకంగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న వారినే డ్యూటీలోకి తీసుకోవాలని సీఎం ఆలోచన చేస్తున్నరు. స్వచ్ఛందంగా షరతులకు అంగీకరిస్తున్నట్టు కార్మికులు సంతకం చేయాల్సి ఉంటుంది’’ అని ఆ ఆఫీసర్​ పేర్కొన్నారు. అంతేగాకుండా షరతులను ఉల్లంఘిస్తే సంస్థ తీసుకునే చర్యలకు కట్టుబడతామని అంగీకరించాల్సి ఉంటుందన్నారు.