కాశింతో హాని ఏముంది?. డీజీపీకి హైకోర్టు ఆదేశం

కాశింతో హాని ఏముంది?. డీజీపీకి హైకోర్టు ఆదేశం
  • ఆరోపణలు వద్దు.. ఆధారాలు చూపండి 
  • డీజీపీ, సంగారెడ్డి సీపీకి హైకోర్టు ఆదేశం
  • ఎప్పటి కేసులోనే తీరుబడిగా అరెస్టేంది?
  • ఇండ్లలో పోలీసులే డాక్యుమెంట్లుపెడుతున్నట్లు కేసులు వస్తున్నాయి
  • ఇది తీవ్రంగా పరిగణించాల్సిఅంశం: హైకోర్టు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు‘‘ఓయూ ప్రొఫెసర్‌‌‌‌ చింతకింది కాశింకు మావోయిస్టులతో సంబంధాలంటూ ఆరోపణలు వద్దు. ఆ ఆరోపణలకు ఆధారాలుంటే  చూపండి. ఎప్పటి కేసులోనో తీరుబడిగా ఇప్పుడే ఎందుకు ఆయనను అరెస్ట్‌‌‌‌ చేయాల్సివచ్చింది? ఇప్పటికిప్పుడే సమాజానికి హానీ ఉందని పోలీసులకు ఎందుకు అనిపించింది?” అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కాశిం అరెస్టుపై వివరణ ఇవ్వాలని డీజీపీ మహేందర్​రెడ్డి, సంగారెడ్డి సీపీ జోయల్ డేవిస్​తోపాటు గజ్వేల్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.  2016లో నమోదైన కేసులో ఎలాంటి దర్యాప్తు చేయకుండా కాశింను అరెస్ట్ చేయడం అన్యాయమంటూ స్టేట్‌‌‌‌ సివిల్‌‌‌‌ లిబర్టీస్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ గడ్డం లక్ష్మణ్‌‌‌‌ వేసిన హెబియస్‌‌‌‌ కార్పస్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై ఆదివారం చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్‌‌‌‌ ఎ.అభిషేక్‌‌‌‌రెడ్డి బెంచ్​ముందు విచారణ కొనసాగింది.

సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్న కాశింను గజ్వేల్ పోలీసులు హైదరాబాద్  బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని చీఫ్​ జస్టిస్​ ఇంట్లో ఉదయం 10.30 గంటలకు హాజరు పరిచారు. సుమారు మూడు గంటలపాటు అక్కడే హైకోర్టు బెంచ్​ వాదనలు విన్నది. కాశిం తరఫున అడ్వకేట్​ రఘునాథ్ వాదనలు వినిపించారు. ‘‘ఓయూలో కులాల గురించి కాశిం పుస్తకం రాశాక అరెస్ట్‌‌‌‌ చేశామంటున్నారు. కాశింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని 2016లో లొంగిపోయిన మావోయిస్టు ఎమ్మెస్‌‌‌‌ సుందర్‌‌‌‌రెడ్డి చెబితే 2020లో అరెస్ట్‌‌‌‌ చేయడమేంది? అప్పటి చార్జిషీటులో కాశిం, ఆయన భార్య సహా 44 మంది పేర్లు ఉన్నాయి కదా.. ఆ కేసు పరిస్థితి ఏమిటి? కాశింపై ఉన్న 5 క్రిమినల్‌‌‌‌ కేసుల పురోగతి ఏమిటి? ఇది ఒక్క కాశింకి సంబంధించిన వ్యవహారమే అనుకోవద్దు. రాజ్యాంగ, మానవహక్కులతో ముడిపడిన ప్రజలందరికీ సంబంధించిన అత్యంత ముఖ్యమైన కేసు” అని హైకోర్టు బెంచ్​ పేర్కొంది. రిమాండ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌లో కాశింపై 2006 నుంచి ఇప్పటి వరకూ 5 క్రిమినల్‌‌‌‌ కేసులున్నట్లు పేర్కొన్నారని, పద్నాలుగేండ్లుగా ఏమీ చేయకుండా ఇప్పుడే కాశింను ఎందుకు అరెస్టు చేయాల్సివచ్చిందని పోలీసుల్ని   ప్రశ్నించింది. రోజూ యూనివర్సిటీలో పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్​ కాశిం కనిపించడం లేదని చెప్తున్న పోలీసులు.. ఆ మేరకు సంబంధిత కోర్టుకు ఏ విధంగా తెలియజేశారో కూడా వివరించాలని ఆదేశించింది.

పోలీసులే డాక్యుమెంట్లు పెడుతున్నారట

‘‘ఇండ్లల్లోకి పోలీసులు వచ్చి మావోయిస్టు పార్టీ పుస్తకాలు, సాహిత్యం, డాక్యుమెంట్స్‌‌‌‌ పెట్టి.. అటు తర్వాత మళ్లీ పోలీసుల తనిఖీల్లో అవన్నీ దొరికాయంటున్నారని హైకోర్టుకు కేసులు వస్తున్నాయి. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఏది నిజమో, ఏది అవాస్తవమో తేల్చాల్సిన బాధ్యత హైకోర్టుపై ఉంది. ఇందులోనే మానవహక్కులు ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ కేసును లోతుగా విచారణ చేయాలని నిర్ణయించాం” అని హైకోర్టు స్పష్టంచేసింది. పోలీసుల సోదాల్లో కాశిం ఇంట్లో స్వాధీనం చేసుకున్న వాటి జాబితా, ఇప్పటి వరకూ కాశింపై ఉన్న కేసుల విచారణ పరిస్థితి, మావోయిస్టులతో ఆయనకు సంబంధాలున్నాయంటూ చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలను సమగ్రంగా కౌంటర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ పొందుపర్చాలని ఆదేశించింది. విచారణను 24వ తేదీకి వాయిదా వేస్తున్నామని, కాశింను జ్యుడిషియల్‌‌‌‌ రిమాండ్‌‌‌‌లోనే ఉంచాలని స్పష్టం చేసింది.

see more news

వాటర్ వార్ కు తెరపడ్తదా?.. రేపు ఢిల్లీలో మీటింగ్

ప్లీజ్‌‌‌‌ .. ఓటేసి పోండి.. ఊరెళ్లిన ఓటర్లకు క్యాండిడేట్ల అభ్యర్థన