కార్మిక సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం

కార్మిక సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం
  • సింగరేణి లాభాలు ప్రకటించి 35 శాతం వాటా త్వరగా చెల్లించాలి 
  • గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్​ సీతారామయ్య డిమాండ్ 

గోదావరిఖని,/ కోల్ బెల్డ్, నస్పూర్ వెలుగు: సింగరేణి  కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని గుర్తింపు సంఘం యూనియన్ (ఏఐటీయూసీ)అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం సింగరేణి ఆర్జీ–1 జనరల్ మేనేజర్ ఆఫీసు వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. 

బీఆర్ఎస్​హయాంలో పదేండ్లు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ  గెలిచిన తర్వాత పెండింగ్ సమస్యలపై యాజమాన్యంతో మూడు సార్లు స్ట్రక్చర్ మీటింగ్ లు నిర్వహించినట్టు తెలిపారు. దాదాపు 28 డిమాండ్లపై చర్చించగా14 డిమాండ్లకు అంగీకరించి ఆరు నెలలు గడిచినా అమలు కోసం సర్క్యులర్​లు జారీ చేయలేదని ఆయన మండిపడ్డారు.  

సెప్టెంబర్ 12న హైదరాబాద్ సింగరేణి భవన్​లో నిర్వహించిన స్ట్రక్చర్ మీటింగ్ లో కంపెనీ లాభాలను వెంటనే ప్రకటించి 35 శాతం వాటా కార్మికులకు త్వరగా చెల్లించాలని, అదేవిధంగా అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్​లు జారీ చేయాలని కోరామని పేర్కొన్నారు. 

యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించగా మీటింగ్ ను  బహిష్కరించామని పేర్కొన్నారు. వెంటనే సింగరేణి లాభాలు ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలని,  సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్​చేశారు. అనంతరం జీఎం లలిత్​కుమార్​కు వినతిపత్రం అందజేశారు.  ఈ ధర్నాలో లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, గోసిక మోహన్, మాదన మహేష్, రంగు శ్రీను, ఎస్ వెంకట్ రెడ్డి, రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.