హైకోర్టు ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన చీఫ్ జస్టిస్

హైకోర్టు ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన చీఫ్ జస్టిస్

సత్వర న్యాయం ద్వారా వచ్చే ఫలితాలు రానున్న రెండు, మూడు నెలల్లోనే ప్రజలు చూస్తారని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. కరోనా సహా క్లిష్ట పరిస్థితుల్లో న్యాయశాఖ బాగా పనిచేసిందన్నారు. దేశ మొత్తం అజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. హైకోర్టు ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారని..ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. కరోనా సమయంలో అనేక మంది న్యాయవాదులకు ఉచిత వ్యాక్సినేషన్ అందించినట్లు తెలిపారు. 

హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి  42 కు పెరిగిందని ఉజ్జల్ భుయాన్ తెలిపారు. నూతనంగా మరో ఆరుగురు న్యాయమూర్తులు నియమించడం హర్షించదగ్గ విషయమన్నారు. గత ఆరునెలల్లోనే 23 మంది న్యాయమూర్తులను నియమించుకోగలిగామన్నారు.కోర్టులలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇక లోక్ ఆదాలాత్ ద్వారా కేసులను పరిష్కరించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నట్లు వివరించారు.