
హైదరాబాద్ : ఐదేండ్ల క్రితం తప్పిపోయిన బాలుడు సేఫ్‌గా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. తెలంగాణ స్టేట్ పోలీసులు అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ యాప్ దర్పన్ ద్వారా ఇది సాకారమైంది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నివాసి ఘన్‌శ్యామ్ సోని. వీరి కుమారుడు సోమ్ సోని. జులై 2015న ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. బాలుడిని అసోంలోని గోలపారా పోలీసులు గుర్తించి అక్కడి స్థానిక శిశు సంక్షేమకేంద్రంలో చేర్పించారు. దర్పన్ ద్వారా తెలంగాణ పోలీసులు బాలుడిని గుర్తించి ఆచూకీని కనుగొన్నారు.
తెలంగాణ అడిషనల్ డీజీపీ (ఉమెన్ సేఫ్టీ వింగ్) స్వాతి లక్రా మాట్లాడుతూ… దేశంలోని వివిధ శిశు సంక్షేమకేంద్రాల్లో ఉన్న పిల్లలను దర్పణ్ యాప్ సహాయంతో తప్పిపోయిన పిల్లల ఫోటోలతో సరిపోల్చగా బాలుడి ఆచూకీని గుర్తించినట్లు తెలిపారు. దీంతో వెంటనే అలహాబాద్‌లోని హండియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించామన్నారు. పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు.
వారు గోలపారాలోని శిశు సంక్షేమ కేంద్రానికి చేరుకుని తమ కుమారుడిని గుర్తించారన్నారు. బాలుడి ఆచూకీని గుర్తించడంలో తెలంగాణ రాష్ర్ట పోలీసులు ప్రధాన పాత్ర పోషించారన్నారు. తప్పిపోయిన పిల్లలను తెలంగాణ పోలీసులు ఫేస్ రికగ్నిషన్ టూల్, దర్పన్ ద్వారా కనుగొని వారి కుటుంబాలతో తిరిగి ఐక్యం చేస్తున్నట్లు తెలిపారు స్వాతి లక్రా. తమబిడ్డ దొరికినందుకు పట్టరాని సంతోషం వ్యక్తం చేసిన ఘన్‌శ్యామ్ సోని.. పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు.