
- వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
- చిన్న కాల్వల నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకూ దేనినీ నిర్లక్ష్యం చేయొద్దు
- రాతపూర్వక ఆదేశాల కోసం చూడొద్దు.. ఎమర్జెన్సీ నిధులను వాడుకోండి
- అలర్ట్ మెకానిజమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాబోయే రోజుల్లో వానలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. డ్యాములు, రిజర్వాయర్లు, కాల్వలు, చెరువులపై 24 గంటలూ నిఘా ఉంచాలని.. గండ్లు పడకుండా చూసుకోవాలని, పడితే వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే మూడు రోజులూ అధికారులంతా వారి వారి హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, వాటిని దాటి రావొద్దని స్పష్టం చేశారు.
వరద నివారణ చర్యలకు అవసరమైన పనులను చేపట్టాలని, అందుకు నిధులను అత్యవసర ప్రాతిపదికన వాడుకోవాలన్నారు. బుధవారం ఆయన తన నివాసం నుంచి ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్షలో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని ఐఎండీ చెప్పిన రిపోర్టులను అధికారులకు మంత్రి ఉత్తమ్ వివరించారు.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏ అధికారి కూడా వాళ్ల హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఊర్లలో ఉన్న చిన్న చిన్న కాల్వల దగ్గర్నుంచి.. పెద్ద పెద్ద డ్యామ్‌ల వరకు అన్నింటినీ క్షుణ్ణంగా పర్యవేక్షించాలని, దేనినీ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. పరిస్థితి అదుపు తప్పుతున్నదని అనిపించినా, ప్రమాదం పొంచి ఉన్నా వెంటనే జిల్లా కలెక్టర్, సీఈ, ఇరిగేషన్ సెక్రటరీలకు సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేయండి
నాగార్జునసాగర్, జూరాల, శ్రీరాంసాగర్, కడెం వంటి భారీ ప్రాజెక్టుల వివరాలను మంత్రి ఉత్తమ్ అడిగి తెలుసుకున్నారు. వాటికి వస్తున్న వరద, ప్రస్తుత నిల్వ ఇతర అంశాలను ఆరా తీశారు. ఆయా ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని మంత్రికి అధికారులు వివరించారు.
అన్ని సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను పాటిస్తున్నామని, క్షేత్ర స్థాయిలో నిఘాను మరింతగా పెంచుతామని వారు చెప్పారు. అన్ని వేళలా కమ్యూనికేషన్ చానెల్స్ పనిచేసేలా చూసుకోవాలని, అలర్ట్ మెకానిజమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. వచ్చే రెండు రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంటానని, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఏ అధికారైనా తనకు ఫోన్ చేసి చెప్పొచ్చని సూచించారు.
వేగంగా స్పందించాలి
మీడియం ప్రాజెక్టులు, కాల్వలు, చెరువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడితే వాటిని వెంటనే పూడ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఓవర్ ఫ్లో, సీపేజీ, నిర్మాణాల్లో లోపాలను గుర్తిస్తే వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. రాతపూర్వకంగా వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూడకుండా.. ఎమర్జెన్సీ నిధులను అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేలా ఇచ్చిన జీవో 45 ద్వారా అధికారులు నిధులను వరద నివారణ పనుల కోసం వాడుకోవచ్చన్నారు. వేగంగా, నిర్ణయాత్మకంగా స్పందించాలని సూచించారు.