బతుకమ్మ, దసరాకు ప్రత్యేక బస్సులు.. ముందస్తు రిజిస్టేషన్ చేసుకుంటే..

బతుకమ్మ, దసరాకు  ప్రత్యేక బస్సులు.. ముందస్తు రిజిస్టేషన్ చేసుకుంటే..

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండగలకు టీఎస్ఆర్టీసీ 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25 తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలవుతాయని తెలిపారు. 

ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపనుందని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 

హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్ లు ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-- ఉప్పల్, ఎంజీబీఎస్- -జేబీఎస్, ఎంజీబీఎస్ --ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులోకి తీసుకురానుంది. 

అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి.

ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయి. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. 

ఈ ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.in లో చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.