
- 1 నుంచి 15వ స్థానానికి పడిపోయిన నిర్మల్
- మెరుగైన మంచిర్యాల ర్యాంకు
- మరింత పడిపోయిన ఆసిఫాబాద్ ర్యాంకు
నెట్వర్క్, వెలుగు: విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన టెన్త్వార్షిక ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 34,810 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 33,104 మంది ఉత్తీర్ణులయ్యారు. 1,706 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో 97.95 శాతం మంది పాసయ్యారు. ఓవరాల్గా జిల్లా 9వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు వందశాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటారు.
పి.తన్విత 575 మార్కులు, టి.రిషిక 575, సీహెచ్ వర్ష 568, కె.సంజన 567, సీహెచ్ స్పందన566, డి.అంజలి 566 మార్కులు సాధించారు. గత 11 ఏండ్లుగా స్కూల్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని ప్రిన్సిపాల్ జి.సంగీత తెలిపారు. స్టూడెంట్లను అభినందించారు.
నేరడిగొండలోని కేజీబీవీ స్కూల్ కు విద్యార్థిని బి.ఆర్థిక 564 మార్కులతో మండల టాపర్ గా నిలిచింది. బుగ్గారం రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్సీహెచ్ ఆర్తి 559 మార్కులు సాధించింది.
124 స్కూళ్లలో వంద శాతం రిజల్ట్
టెన్త్ఫలితాల్లో మంచిర్యాల జిల్లా 96.54 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. గతేడాది 20వ స్థానంలో నిలిచిన జిల్లా మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ, ప్రైవేట్స్కూల్స్నుంచి 9,179 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్రాయగా 8,861 మంది పాసయ్యారు. 318 మంది ఫెయిలయ్యారు. వీరిలో183 మంది బాయ్స్, 135 మంది గర్ల్స్ఉన్నారు. ఫలితాల్లో జిల్లాలోని గవర్నమెంట్స్స్కూల్స్సత్తాచాటాయి. 14 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరు, 18 కేజీబీవీలకు 10, 101 లోకల్ బాడీ స్కూళ్లకు 46, ఎంజేపీ 7 స్కూళ్లకు ఐదు, 5 మోడల్స్కూళ్లకు మూడు, 9 సోషల్వెల్ఫేర్స్కూళ్లకు ఆరు స్కూళ్లు వంద శాతం రిజల్ట్సాధించాయి. 80 ప్రైవేట్స్కూళ్లకు గాను 45 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. రాథోడ్యోగేశ్వర్582 మార్కులు సాధించి జిల్లాలోనే టాప్లో నిలిచాడు. ఎల్పుల నరేందర్ 570 మార్కులు తెచ్చుకున్నాడు.
సత్తాచాటిన సీవోఈ విద్యార్థులు
బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు మరోసారి రాణించారు. జుమ్మడి అశ్రిత్ రామ్ 581 మార్కులు, ఆడే రామ్ చరణ్ 563, అరుణ్ 559, సోన్ కాంబ్లే కిషన్ 553, బండారి మనోజ్ కుమార్ 552, బండారి వినయ్ 547, ఆకుదారి రాజశేఖర్ 546, కోబ్రాగాడే భీమ్రావు 541, ఇందూరి సంజయ్ 540, కొంపల్లి రాకేశ్ 539 మార్కులు సాధించారు. మొత్తం 32 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ విద్యార్థిని సుష్మిత 561 మార్కులు తెచ్చుకుంది.
32వ స్థానంలో ఆసిఫాబాద్
టెన్త్ఫలితాల్లో ఆసిఫాబాద్ జిల్లా ర్యాంకు మరింత పడిపోయింది. గతేడాది కన్నా ఒక స్థానం దిగజారింది. గతేడాది 31వ స్థానంలో నిలిచిన జిల్లా ఈసారి 32వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో మొత్తం 6,480 మంది పరీక్షలు రాయగా 5,654 మంది మాత్రమే పాసయ్యారు. పాస్ పర్సంటేజీ 87.25 శాతంగా ఉంది. సిర్పూర్ టీ మండల టాపర్ గా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్) స్టూడెంట్ వై.అనూష (582) నిలిచింది. కౌటల మండలం జడ్పీ హై స్కూల్ స్టూడెంట్ కోమటిపల్లి సాయికృష్ణ 559 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచాడు. జిల్లా కేంద్రంలోని పీవీటీజీ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 56 మందికి గాను 51 మంది పాసయ్యారు.
ఒకటి నుంచి 15 స్థానానికి..
ఫలితాల్లో నిర్మల్ జిల్లా 96.70 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. బాలికలు 97.42 శాతం, బాలురు 95.95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 167 గవర్నమెంట్ స్కూల్స్ కు గాను 92 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. గత రెండేండ్లు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన నిర్మల్ జిల్లా ఈసారి 15వ స్థానానికి దిగజారింది. మొత్తం 9123 మంది పరీక్షకు హాజరు కాగా 8822 పాసయ్యారు.