చెప్పులతోనే రావాలె!..గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్​పీఎస్సీ సూచన

చెప్పులతోనే రావాలె!..గ్రూప్1 అభ్యర్థులకు  టీఎస్​పీఎస్సీ సూచన
  • బూట్లు, ఫోన్లు, ఆభరణాలు తేవొద్దు
  • రేపు ఉదయం 10:30 గంటలకు ప్రిలిమ్స్ పరీక్ష
  • 994 ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు, పోలీసులతో భారీ బందోబస్త్ 
  • హాజరు కానున్న 3.80 లక్షల మంది అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల11న జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్​పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది అక్టోబర్ 16న  గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించింది. అయితే, పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణను ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ పరీక్షకు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2.60 లక్షల మంది అభ్యర్థులు హాల్​టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. హాల్ టికెట్ మీద ఫొటో లేకపోయినా, సరిగా రాకపోయినా ముగ్గురు గెజిటెడ్ ఆఫీసర్లతో సంతకం పెట్టించుకొని రావాలని అభ్యర్థులకు సూచించారు. బెల్ట్ పెట్టుకుని వస్తే తీసి చెక్ చేస్తామని చెప్తున్నారు. బూట్లతో రావొద్దనీ, కేవలం చెప్పులతోనే రావాలని సూచించారు. కాగా, పరీక్షల నిర్వహణపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సెంటర్ల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 

సీఎస్​లతో జూమ్ మీటింగ్ 

గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లపై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి  శుక్రవారం సెంటర్ చీఫ్ సూపరిటెండెంట్లతో జూమ్ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎయిర్ పోర్టులో చెకింగ్​ చేసినట్లు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నట్టు చెప్పారు. ఇన్విజిలేటర్లతో సహా పరీక్షా కేంద్రంలోకి ఎవ్వరూ సెల్ ఫోన్లు తీసుకుపోవద్దని కోరారు. నిబంధనలను ఇప్పటికే అభ్యర్థుల సెల్ ఫోన్లకు మెసేజ్ ల రూపంలో పంపించినట్టు చెప్పారు. కాగా, ప్రిలిమ్స్ పరీక్ష సాఫీగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లను సీఎస్​ శాంతి కుమారి ఆదేశించారు. గ్రూప్​-1 పరీక్షలు, సుపరిపాలన, సాహిత్య దినోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

అభ్యర్థులకు కొన్ని సూచనలు..

 ఉదయం 8:30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతి, 10.15  గంటలకు గేట్లు క్లోజ్, 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం.   హాల్ టికెట్, ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి. పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సర్కార్ ఎంప్లాయీ ఐడీ కార్డు.. మొదలైనవి.  క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్​ వస్తువులు, ఇతర విలువైన ఆభరణాలు తీసుకురావొద్దు.   ఓఎంఆర్ షీటులోని సూచనలు చదవాలి. బబ్లింగ్​కు బాల్ పాయింట్ పెన్ (బ్లూ/బ్లాక్) మాత్రమే ఉపయోగించాలి.  హాల్ టికెట్ నెంబర్, క్వశ్చన్ బుక్ లెట్ నెంబర్ జాగ్రత్తగా ఎన్​ కోడ్ చేయాలి.

గ్రూప్‌‌‌‌ 1 వాయిదాకు నో  చెప్పిన హైకోర్టు

ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్‌‌‌‌ 1 ప్రిలిమ్స్‌‌‌‌ ఎగ్జామును వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన అప్పీల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ను హైకోర్టు డిస్మిస్‌‌‌‌ చేసింది. గతంలో సింగిల్‌‌‌‌ జడ్జి చెప్పిన తీర్పును సవాల్‌‌‌‌ చేస్తూ ఎస్‌‌‌‌.మురళీధర్‌‌‌‌రెడ్డి అప్పీల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేశారు. దాన్ని జస్టిస్‌‌‌‌ అభినంద్‌‌‌‌కుమార్‌‌‌‌ షావిలి, జస్టిస్‌‌‌‌ నామవరపు రాజేశ్వర్‌‌‌‌రావులతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించి కొట్టివేసింది. గత ప్రిలిమ్స్‌‌‌‌లో తప్పుడు బబ్లింగ్‌‌‌‌ వల్ల అనర్హతకు గురైన నలుగురు అభ్యర్థులకు ఇప్పుడు మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కమిషన్‌‌‌‌కు హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆదివారం యథాతథంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ జరగనుంది. కాగా..లీకేజీ కేసును సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌‌‌‌పై కూడా విచారణ జరిగింది. ఈ పిటిషన్‌‌‌‌ను జస్టిస్‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌రెడ్డి శుక్రవారం విచారించారు. పేపర్ లీకేజీ అయ్యిందనే కారణంతో పరీక్షలను వాయిదా వేయడం సమస్యకు పరిష్కారం కాదని కోర్టు అభిప్రాయపడింది. కేసును సీబీఐతో విచారణకు ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఒకవేళ సీబీఐ విచారణకు 20 ఏండ్లు పడితే అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది.  దర్యాప్తు రిపోర్టు 3 వారాల్లోగా ఇవ్వాలని సిట్‌‌‌‌ ను ఆదేశించింది.