- కొత్త రోస్టర్ ప్రకారం కరక్టే
- స్పష్టం చేసిన టీఎస్పీఎస్సీ
హైదరాబాద్,వెలుగు: కొత్త రోస్టర్ నిబంధనల ప్రకారం గ్రూప్1 నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటాలో ఒక్క పోస్ట్ మాత్రమే అలాట్ అవుతుందని టీఎస్ పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఇటీవల జారీ చేసిన గ్రూప్1 నోటిఫికేషన్503 పోస్టుల్లో స్పోర్ట్స్కోటాలో కేవలం ఒక్కపోస్టే రావడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు 2% పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సి ఉందని, ఈ లెక్క ప్రకారం కనీసం పది పోస్టులైన కేటాయించాలని కొందరు టీఎస్పీఎస్సీ అధికారులను కలవగా వాళ్లు స్పష్టత ఇచ్చారు. తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్22, 22ఏ ప్రకారం స్థిరమైన రోస్టర్ సైకిల్ ఉంటుందని తెలిపారు. రోస్టర్ సైకిల్ 1–100 పాయింట్లు కలిగి ఉంటుందని, ప్రతి రిక్రూట్మెంట్లో ఒక్కోపోస్టుకు రోస్టర్ సైకిల్ పాయింట్లు కేటాయిస్తారని వెల్లడించారు. దీని ప్రకారం రెండు మల్టీజోన్లలో వేర్వేరుగా కొత్త రోస్టర్లను అమలు చేసినట్టు చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో 48, 98 పాయింట్లు కింద పోస్టులు రిజర్వు అవుతాయని, దీని ప్రకారం 48 పాయింట్ల వరకున్న పోస్టుల్లోనే స్పోర్ట్స్ కోటా అమల్లోకి వస్తుందన్నారు. ఈ క్రమంలో మల్టీజోన్1లో 72 ఎంపీడీఓ పోస్టులుండగా.. 48వ పాయింట్ కింద స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్టు అలాట్ చేసినట్టు వివరించారు. అయితే మల్టీజోన్2లో 49 ఎంపీడీఓ పోస్టులున్నా.. వాటిలో 5 బ్యాక్ లాగ్ పోస్టులున్నాయని, దీంతో తాజా పోస్టులు 44 మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. రోస్టర్ పాయింట్ 48కి చేరకపోవడంతో జోన్ 2లో స్పోర్ట్స్కోటాలో పోస్టు అలాట్ కాలేదని స్పష్టత ఇచ్చారు. రెండు వేర్వేరు మల్టీ జోన్లలో నోటిఫై చేసిన పోస్టులను ఒకే చోట కలిపి రోస్టర్ పాయింట్ అలాట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని
చెప్పారు.
