గ్రూప్ 2 పరీక్షను అడ్వాంటేజ్ తీసుకున్న విపక్షాలు.. రద్దు చేస్తే ఎన్నికల తర్వాతే నిర్వహణ

గ్రూప్ 2 పరీక్షను  అడ్వాంటేజ్ తీసుకున్న విపక్షాలు.. రద్దు చేస్తే ఎన్నికల తర్వాతే నిర్వహణ

గ్రూప్ –2 పరీక్ష నిర్వహణ గందరగోళంలో పడింది. మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ నిన్ని టీఎస్పీఎస్సీ గ్రూప్ –2 అభ్యర్థులు ఓయూ జేఏసీ, ఎన్ ఎస్ యూఐ ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఐదుగురు ప్రతినిధులతో కమిషన్ అధికారులు చర్చలు జరిపారు. రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించారు. అంతలోనే గ్రూప్ 2 వాయిదా పడిందనే మెస్సేజ్ లు వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేశాయి. దీనిపై కమిషన్ క్లారిటీ ఇచ్చింది. తాము గ్రూప్ 2 వాయిదా వేయలేదని రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది. దీంతో భారీ సంఖ్యలో టీఎస్పీఎస్సీ ఆఫీసుకు వచ్చిన అభ్యర్థులు సాయంత్రం వరకు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. 

నిర్ణయం వెల్లడిస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని పేర్కొన్నారు. ఒకే నెలలో మూడు గురుకుల, జేఎల్, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారని, సిలబస్ కూడా మూడింటికి వేర్వేరుగా ఉన్నదని, పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించలేదు. భారీ సంఖ్యలో విద్యార్థులు తరలిరావడంతో వారికి సంఘీభావంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ నాయకుడు అద్దంకి దయాకర్, ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులు కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చి విద్యార్థులకు అండగా నిలబడ్డారు. 

మరో వైపు ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యార్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై బీజేవైఎం ఆగస్టు 11వ తేదీ జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు గ్రూప్ –2ను యథాతథంగా నిర్వహించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే వాదన కూడా ఉంది. సున్నితంగా మారిన ఈ అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్న ఇబ్బందులు తప్పవని సర్కారు భావిస్తోంది. ఏం చేయాలో అర్థం కాక మీన మేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. 

దీనిపై నిన్న కొందరు అభ్యర్థులు హైకోర్ట్ ను ఆశ్రయించారు. పరీక్షను వాయిదా వేయాలని కోరారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై ఆగస్టు 14వ తేదీన సమాధానం చెప్పాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.  రాజకీయ రంగు పులుముకొని, సున్నితంగా మారిన  గ్రూప్ 2 పరీక్ష అంశంలో హైకోర్టు ఆదేశాన్ని పాటిస్తుందా.. కోర్టు తీర్పు వచ్చే లోపు కమిషన్ పాలకమండలి నిర్ణయం ప్రకటిస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.