
హైదరాబాద్, వెలుగు : గ్రూప్1 మెయిన్స్ ఎంపికపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ఎగ్జామ్ లో క్వాలిఫయింగ్ కోసం ప్రత్యేకంగా కటాఫ్ మార్కులు ఉండబోవని, మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఒక్కో కేటగిరిలో ఉన్న ఖాళీలను బట్టి, ఒక్కో పోస్టుకు 50 మందిని 1:50 నిష్పత్తిలో మెయిన్స్పరీక్షకు ఎంపిక చేస్తామని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్ తెలిపారు. ప్రత్యేకంగా కటాఫ్ మార్కులంటూ ఉండబోవని వెల్లడించారు. ఆదివారం జరిగిన గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కఠినంగా రావడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 503 పోస్టుల భర్తీకి 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 3.42 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇతర ఉద్యోగ పరీక్షల మాదిరి కటాఫ్ మార్కులు గ్రూప్1కు పెట్టడం లేదు. దీనికి సంబంధించి గతంలోనే జీవో 55 రిలీజ్ చేశారు. అయితే కటాఫ్ మార్కులు పెడితే పలు పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉంది. అలాగే కొన్ని సెంటర్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదు. కొన్నింటిలో సరిగా పనిచేయకపోవడంతో కొందరివే తీసుకున్నారు. దీనిపై అభ్యర్థుల్లో కొంత గందరగోళం నెలకొన్నది. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోకున్నా పెద్దగా ఇబ్బంది లేదని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
25,150 మంది మెయిన్స్ కు ఎంపిక చేస్తరు
మల్టీ జోన్ వారీగా ఉన్న పోస్టులు, రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్, మహిళలు, స్పోర్ట్ కోటాను పరిగణనలోకి తీసుకుని గ్రూప్1 ప్రిలిమ్స్ మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ప్రిలిమ్స్ రాసిన 2,86,01 మంది నుంచి 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. ఒక్కో పోస్టు, కేటగిరి, అర్హతల ఆధారంగా ఎంపిక ఉంటుంది. కాగా వారంలో ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయనున్నారు.