గ్రూప్ 1 ఎగ్జామ్ సెయింట్ ఫ్రానిస్ స్కూల్ ఇష్యూపై టీఎస్​పీఎస్సీ భేటీ

గ్రూప్ 1 ఎగ్జామ్ సెయింట్ ఫ్రానిస్ స్కూల్ ఇష్యూపై టీఎస్​పీఎస్సీ భేటీ
  • సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్​కు కమిషన్ ఆదేశం  
  • ఆ రిపోర్టు తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం
  • గ్రూప్ 1 ఎగ్జామ్ ఎస్ఎఫ్ఎస్​ ఇష్యూపై టీఎస్​పీఎస్సీ భేటీ

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​లోని సెయింట్ ఫ్రానిస్ స్కూల్​(ఎస్ఎఫ్ఎస్) లో జరిగిన గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇష్యూపై టీఎస్​పీఎస్సీ సీరియస్ గా ఉంది. ఆరోజు ఆందోళనలో పాల్గొన్న 47 మంది అభ్యర్థుల ఓఎంఆర్​ షీట్లను వాల్యువేషన్ చేయాలా లేదా అనే విషయంపై  ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం టీఎస్​పీఎస్సీ ఆఫీసులో కమిషన్ చైర్మన్ జనార్దన్​రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్​ కు బదులు ఇంగ్లిష్/నాన్ తెలుగు లాంగ్వేజీ క్వశ్చన్ పేపర్లు రావడంపై చర్చించారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్​లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్​ అమోయ్ కుమార్ ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చారు. కానీ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్​కు చైర్మన్ జనార్దన్​రెడ్డి ఆదేశాలు జారీచేశారు. మినిట్ టు మినిట్ వివరాలు ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. ఆ సెంటర్​లో పేపర్లు తారుమారు కావడానికి గల కారణాలనూ ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. అయితే 47 మందికి ఇంగ్లిష్/నాన్ తెలుగు లాంగ్వేజీ క్వశ్చన్ పేపర్లు రావడంతో, వెంటనే పొరపాటును గుర్తించి వారికి సరైన క్వశ్చన్ పేపర్లు ఇచ్చినా పరీక్ష రాసేందుకు వారు ముందుకు రాలేదు. పరీక్ష జరుగుతున్న సమయంలో కొందరు అభ్యర్థులు ఇతరులను ఇబ్బందులకు గురిచేయడంపై కమిషన్ సీరియస్​గా ఉంది. వారిపై చర్యలు తీసుకునే అవకాశముంది. మరోపక్క కలెక్టర్​నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత ఆ 47 అభ్యర్థుల పేపర్లను వాల్యువేషన్ చేయాలో వద్దో  నిర్ణయం తీసుకుంటామని కమిషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా అబిడ్స్​లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో, స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీలో ఆలస్యంగా పరీక్ష  రాసిన స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నారు. 

50 శాతం ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తి

ఈ నెల 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ జరుగుతోంది. 3.80 లక్షల మందికి 2.86 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. శుక్రవారం నాటికి సగానికి పైగా ఓఎంఆర్​ షీట్ల స్కానింగ్ పూర్తయిందని అధికారులు తెలిపారు. రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ వెంటనే వాటిని వెబ్ సైట్​లో పెడ్తామని పేర్కొన్నారు. ఆ వెంటనే ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.