
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మెంబర్ సుమిత్రానంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం గవర్నర్ తమిళిసైకి పంపించారు. ఈ సందర్భంగా సుమిత్రానంద్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మారడంతో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెంది రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
‘‘వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చపడింది. జరిగిన దుష్పరిణామాల్లో సభ్యులుగా మా ప్రమేయం ఏమీ లేదు. అయినా కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తీవ్రంగా బాధించింది. ఉద్యోగ నామ సంవత్సరం అనుకున్న ఏడాదే ఎన్నికలు రావడంతో ఉద్యోగ నియామక ప్రక్రియ సజావుగా జరుపలేకపోయాం. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టే సమయంలోనే.. సర్కార్ వ్యతిరేక వర్గాలు, పార్టీలు పరీక్షల వాయిదా కోసం రకరకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి” అని అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ భాషను కాపాడుకునేందుకు అనేక ఉద్యమాలు చేశానని.. టీటీయూ రాష్ట్ర నాయకురాలిగా ముందుండి పోరాడానని పేర్కొన్నారు. కాగా, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, మెంబర్లు బండి లింగారెడ్డి, ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా.. వాళ్ల రాజీనామాలను గవర్నర్ ఇటీవల ఆమోదించారు. ఇప్పుడు సుమిత్రానంద్ కూడా రాజీనామా చేయగా, ఇక ఒకే ఒక మెంబర్ అరుణకుమారి మాత్రమే తన పదవిలో కొనసాగుతున్నారు.