
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులంటేనే వాహనదారులు బాబోయ్ అనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బస్సు ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చి ఢీకొడుతుందా అని ఆందోళన పడాల్సి వస్తోంది. డ్రైవర్ల నిర్లక్ష్యం, తీవ్ర ఒత్తిడి, కాలం చెల్లిన బస్సులు ఇలా కారణాలేవైనా సరే ఇటీవల కాలంలో తరుచూ ఆర్టీసీ బస్సులు ఇతర వెహికల్స్ ను ఢీకొట్టి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏప్రిల్ లోనే ఆర్టీసీ బస్సు ప్రమాదాల కారణంగా నలుగురు వ్యక్తులు మృతి చెందగా ఆ సంఘటనలు మరవకముందే మే 27న గురువారం మరో రెండు ఘటనలు జరిగాయి. మూసాపేట వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టటంతో బైక్ పై వెళ్తున్న దంపతుల్లో భార్య మృతి చెందగా…భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓవర్ స్పీ్డ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
బాలాపూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ఓ పోల్ ను ఢీకొట్టి డివైడర్ ఎక్కింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నిత్యం ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురికావటం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పోవాల్సి వస్తోంది. గతేడాది గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులు ఢీకొట్టడం వల్ల 35 మంది చనిపోయారు. ఏటేటా ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 20 మందికి పైగా ఆర్టీసీ బస్సులు ఢీకొట్టిన ఘటనల్లో మృతి చెందారు.
పట్టించుకోని అధికారులు
ప్రమాదాల నివారణపై దృష్టి -పెట్టాల్సిన ఆర్టీసీ అధికారులు అది మా పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నామమాత్రంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా మంది కొత్త డ్రైవర్లలో సరైన నైపుణ్యం ఉండటం లేదు. వీటికి తోడు కాలం చెల్లిన బస్సుల కారణంగా ప్రమాదాలను అదుపు చేయటంలో డ్రైవర్లు విఫలమవుతున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 3,700 బస్సులు ఉంటే వాటిలో సుమారు 1,500 బస్సుల వరకు సరైన ఫిట్ నెస్ లేనివే ఉన్నాయి. కొత్త బస్సులు కొనే పరిస్థితి లేకపోవటంతో ఉన్న వాటినే రోడ్లపై తిప్పుతున్నారు. పైగా కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుండటం…ముందుగా వెళ్లాలనే మనస్తత్వంతో అడ్డగోలుగా బస్సులను నడుపుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
అధిక పని ఒత్తిడి
ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై కార్మిక సంఘాల వాదన మరోలా ఉంది. డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉండటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. కావాల్సినంత సిబ్బందిని రిక్రూట్ చేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ హన్మంతు ముదిరాజ్ ఆరోపించారు. డ్రైవర్లు ఏడున్నర గంటలు పనిచేయాల్సి ఉండగా వారితో బలవంతంగా 10 గంటలకు పైగా డ్యూటీ చేయిస్తున్నారని విమర్శించారు. సరిపడా విశ్రాంతి లేకపోవటం, వరుసగా డ్యూటీలు వేస్తుండటంతో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని ఆయన చెబుతున్నారు. దూరప్రాంతాల సర్వీసులను పెంచినా 4 ఏళ్లుగా కండక్టర్లను రిక్రూట్ చేసుకోలేదని మండిపడ్డారు. వీటిన్నింటిపై అధికారులు దృష్టి పెట్టాలని హన్మంత్ ముదిరాజ్ డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ ప్రమాదాల నివారణకు ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.