రూటు మార్చిన ఆర్టీసీ

రూటు మార్చిన ఆర్టీసీ

నిర్మల్, వెలుగు: ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు రూటు మార్చింది. ప్రైవేట్ వాహనాల పోటీని తట్టుకునేందుకు ఆఫీసర్లు ఊరూరు తిరుగుతున్నారు. సంస్థ సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నారు. జిల్లాలో ఆయా డిపో  ఆఫీసర్లు పక్షం రోజులుగా గ్రామాలన్నీ చుట్టేస్తున్నారు. నిర్మల్​ డీఎం సాయన్న ఆధ్వర్యంలో రెండు మూడు రోజులకు ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రైవేట్ వాహనాలు ఎక్కువగా తిరిగే గ్రామాల్లో సంస్థ కల్పిస్తున్న సౌకర్యాలు వివరిస్తున్నారు. ప్రవైట్ ​వెహికల్స్​లో ప్రయాణిస్తే జరిగే ప్రమాదాలు.. నష్టాలు వివరిస్తున్నారు. తాము వెళ్తున్న గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏఏ సమయాల్లో తిప్పాలో.. ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో జనం ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ముందుగానే బస్సులు బుక్ చేసుకున్న వారికి 20 శాతం సబ్సిడీ ఇస్తామని ఆఫీసర్లు ఇస్తామని చెబుతున్నారు. పుణ్యక్షేత్రాలు, జాతరకు 30 మందికి పైగా కలిసి వెళ్లాలనుకునే వారి కోసం వారి ఇంటి వద్దకే బస్సును పంపుతామని చెబుతున్నారు. పదో తరగతి చదివే ఆడపిల్లలకు ఉచిత బస్సు పాసులు ఇస్తున్నామని, 12 సంవత్సరాలలోపు బాలురకు కూడా ఉచిత బస్సు పాసులు అందిస్తున్నట్లు చెబుతూ ఆయా గ్రామాల్లోని వీడీసీ సభ్యుల సహకారాన్ని  కోరుతున్నారు. ప్రైవేట్ వాహనాలను పూర్తిస్థాయిలో అడ్డుకోవాలని, ఆర్టీసీ పరంగా అన్ని రకాల సేవలు అందిస్తామంటున్నారు. 

సంస్థ మనుగడ కోసమే ప్రచారం...

ఆర్టీసీ రక్షించుకునేందుకే ఊరూరా ప్రచారం చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాల కారణంగా సంస్థకు నష్టం వాటిల్లుతోంది. దీనిని సరిదిద్దుకునేందుకు ఇక నుంచి మెరుగైన సేవలతో పాటు అన్ని గ్రామాలకు బస్సు తిప్పుతాం. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేట్ వాహనాలలో ప్రయాణాన్ని ఆపేసి ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలి. సంస్థను కాపాడేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలి.

-  సాయన్న, డీఎం, నిర్మల్