
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : అవసరం మేరకు కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధికి కార్మికులు ఎంతో కృషి చేస్తున్నాన్నారు. కార్మికుల సమస్యలు, సమ్మె నోటీసుపై రవాణాశాఖ మంత్రితో చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
మహాలక్ష్మి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రభుత్వం సైతం బకాయిలను వెంట వెంటనే విడుదల చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ డిపోకు త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు కేటాయిస్తామని ప్రకటించారు.