పండుగల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

పండుగల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈసారి కూడా ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. గతేడాదితో పోలిస్తే అదనంగా 600 బస్సులు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తంగా 4 వేలకుపైగా ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయన్నారు. 30 మందికి పైగా ప్రయాణికులు ఒకే రూట్ కు ప్రయాణించాలనుకుంటే.. కాల్ చేస్తే వాళ్ళ దగ్గరకే స్పెషల్ బస్సు వేస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.  

బస్టాండ్స్ లో రద్దీ

రాష్ట్రంలో బతుకమ్మతో పాటు దసరా పండుగను గ్రాండ్ గా జరుపుకుంటారు. ఇప్పటికే ప్రభుత్వం సెలవులు కూడా ఇవ్వడంతో చాలామంది హైదరాబాద్ సిటీ నుంచి ఊళ్ళకు బయలుదేరారు. విద్యార్ధులు ఇప్పటికే వెళ్ళిపోగా... ఉద్యోగులు, ఇతర పనులు చేసుకునేవారు కూడా ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. బతుకమ్మలు ఆడేందుకు సిటీ నుంచి పెద్దఎత్తున ప్రయాణికులు గ్రామాలకు వెళ్తుండటంతో బస్టాండ్స్ లో రద్దీ కనిపిస్తోంది. కరోనా ఎఫెక్ట్ లేకపోవడంతో ఈసారి ఎక్కువమందే ఊళ్ళ బాట పట్టే ఛాన్స్ ఉంది. అందుకు తగినట్టుగా  ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. హాస్టల్స్ నుంచి విద్యార్ధులు వెళ్ళిపోగా.. ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఊళ్ళ బాట పట్టారు. గతేడాది బస్సులు దొరక్క ఇబ్బంది పడ్డామనీ.. అందుకే ఈసారి ముందే బయల్దేరినట్టు చెబుతున్నారు. 

బతుకమ్మ, దసరా పండగ కోసం

రాబోయే 3, 4 రోజులు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందుకే సద్దుల బతుకమ్మ, దసరా పండగ కోసం... అక్టోబర్ 1 నుంచి 4 దాకా అదనపు బస్సులు వేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 3, 4 తేదీల్లోనే  1600 బస్సులు నడుపుతున్నారు. గత ఏడాది 3,636 ఆర్టీసీ బస్సులు నడిపితే.... ఈసారి 4,198 తిప్పుతున్నట్టు చెప్పారు. ఎంజీబీఎస్ నుంచే కాకుండా..సిటీ నలుమూలల నుంచి కూడా బస్సులు రన్ చేస్తామన్నారు. జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్, మియాపూర్ నుంచి సైతం బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. 

ఆర్టీసీలోనే సురక్షితంగా

ప్రైవేట్ కు పోటీగా ఆర్టీసీ బస్సులు కూడా తిప్పాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రకాల సెస్సులతో పాటు టిక్కెట్ ఛార్జీలు పెంచినందున...ఈ పండక్కి అదనపు బాదుడు వేయడం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో విజయవాడ, బెంగళూరుకు టికెట్ రేట్లలో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. 30మంది కంటే ఎక్కువ మంది ఉంటే... వాళ్ళ దగ్గరకే బస్సు పంపుతామని ఆర్టీసీ అధికారులు అన్నారు. పండుగలకు ఊళ్ళకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి వచ్చేందుకు వీలుగా అక్టోబర్ 4, 5 తేదీల నుంచి అదనపు బస్సులు నడుపుతామని చెబుతున్నారు. ప్రైవేట్ లేదా సొంత వాహనాల్లో కాకుండా ఆర్టీసీలోనే సురక్షితంగా వెళ్ళాలని అధికారులు కోరుతున్నారు.