
తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన నల్ల బంగారు గని సింగరేణి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి.ఈ ఆరు జిల్లాల్లో 29 భూగర్భ గనులు, మరో 19 ఓపెన్ కాస్ట్ గనుల నుంచి బొగ్గును కార్మికులు వెలికితీస్తున్నారు. వేలాది మంది కార్మికులు రేయింబవళ్లు ప్రాణాలకు తెగించి బొగ్గును తోడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. అయితే కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తారో...అసలు బొగ్గు గని ఎలా ఉంటుందో..? ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. అలాంటి వారి కోసం రాష్ట్ర ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
సింగరేణి దర్శన్
కుమ్రంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ... ప్రాణహిత - గోదావరి నదుల పరివాహక ప్రాంతాల్లో 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనుల సందర్శన కోసం టిఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీను అందుబాటులోకి తెచ్చింది. సింగరేణి దర్శన్ పేరుతో అందిస్తున్న ప్యాకేజీలో ఒక్కో వ్యక్తికి రూ. 1600 టికెట్ ధరగానిర్ణయించింది. ఈ ప్యాకేజీలో భాగంగా భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు, జైపూర్ పవర్ ప్లాంట్, రెస్క్యూ స్టేషన్ ను పర్యాటకులు సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో భోజనాన్ని అందిస్తారు. సింగరేణి దర్శన్ టూర్ వెళ్లాలనుకునే వారు... హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్టాండ్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు బస్ స్టేషన్లను టీఎస్ఆర్టీసీ పికప్ పాయింట్లుగా నిర్ణయించింది. మరిన్ని వివరాలను 040-69440000 లేదా 040-23450033 నెంబర్ల ద్వారా సంప్రదించాలని..లేదా www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో మూతపడిన జీడీకే 7 ఎల్ఈపీ గని సందర్శనకు మాత్రమే సింగరేణి అధికారులు అనుమతిచ్చారు.
ప్యాకేజీలో ఏమేమి చూపిస్తారంటే..
సింగరేణి సందర్శనలో భాగంగా ...హైదరాబాద్ ఎంజీబీఎస్ లేదా జేబీఎస్ లో బస్ ఎక్కే టూరిస్టులకు మార్గ మధ్యంలో లోయర్ మానేరు డ్యామ్ ను చూపిస్తారు. అక్కడి నుంచి జీడీకే 7 ఎల్ఈపీ గనికి చేరుకుంటారు. సింగరేణి పనితీరు.. బొగ్గు ఉత్పత్తి కార్మికుల సంక్షేమం రక్షణపై ప్రత్యేక ప్రజెంటేషన్ తిలకిస్తారు. ఆ తర్వాత యైటీంక్లైన్ కాలనీలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్ ను సందర్శిస్తారు. అక్కడ లంచ్ చేసిన తర్వాత ఓసీపీ 3 వ్యూ పాయింట్ నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు ఓసీపీ 3 లో జరిగే బ్లాస్టింగ్ చూపించనున్నారు. అక్కడి నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్ కు తీసుకెళ్లి విద్యుత్ ఉత్పత్తి తీరును వివరిస్తారు. జీడీకే 7 ఎల్ఈపీ గనిలో మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్ట్ ద్వారా పర్యాటకులను 400 మీటర్ల లోతున వరకు తీసుకెళ్తారు. బొగ్గు పొరలు, రక్షణ వివరాలను వివరిస్తారు. ఓసీపీ 3 లో జరిగే బ్లాస్టింగ్ ను ప్రత్యక్షంగా చూసేలా ఏర్పాట్లు కూడా చేశారు. భవిష్యత్ తరాలకు సింగరేణి ప్రస్థానాన్ని ఈ రకంగా అందించనున్నారు.
వేరే రాష్ట్రాల్లోనూ విజయవంతం..
సింగరేణి..బొగ్గు తవ్వకాల్లో దేశంలోనే రికార్డులు తిరగరాస్తోంది. అయితే ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిలో రికార్డును సృష్టించిన సింగరేణి గనులు..త్వరలో టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. బొగ్గు ఉత్పత్తి, బొగ్గు గనుల గురించి పేపర్లో..టీవీల్లో చూడటం..చదవడం తప్ప...అసలు గనులు ఎలా ఉంటాయో కార్మికులకు తప్ప..ఇతర ప్రజలకు తెలియదు. ఈ నేపథ్యంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ..మొట్ట మొదటిసారిగా సాధారణ ప్రజలు గనులు సందర్శించేందుకు అనుమతిచ్చింది. అయితే ఇప్పటికే కోల్ ఇండియా పరిధిలోని మహారాష్ట్రలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, ఝర్ఘండ్‌లోని ధన్‌బాద్, మధ్యప్రదేశ్‌లోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ వంటి మూసేసిన గనులను అక్కడి సంస్థలు టూరిజం స్పాట్స్ గా డెవలప్ చేశాయి. ఆ గనుల వీక్షణకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఇప్పుడు మొదటిసారిగా ఇక్కడి ప్రజలకు గనుల వీక్షణకు అవకాశం రానుంది.