
- అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావుతో కలిసి అక్రమాలు.. సీఐడీ, ఈడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు
- పదేండ్లలో రూ.600 కోట్ల దాకా నిధులు గోల్‌మాల్
- బీసీసీఐ గ్రాంట్లు, ఐపీఎల్ వాటాల దారిమళ్లింపు
- కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు ఐపీఎల్ టికెట్ల సేల్ కాంట్రాక్ట్
- ముగ్గురి బంధువులకే ఫుడ్, ట్రావెల్స్ కాంట్రాక్టులు, హోటల్ బుకింగ్స్
- వీళ్ల అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని టీసీఏ విజ్ఞప్తి
- అజారుద్దీన్ ప్రెసిడెంట్‌గా ఉన్న టైమ్‌లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరిగిన అవినీతి అక్రమాల వెనుక బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, కవిత హస్తం ఉన్నదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ఆరోపించింది. వీళ్లిద్దరూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుతో కలిసి అవకతవకలకు పాల్పడ్డారని తెలిపింది. గత పదేండ్లలో దాదాపు రూ.600 కోట్ల నిధులు గోల్‌మాల్ చేశారని పేర్కొంది. ఈ మేరకు టీసీఏ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ దారం గురువారెడ్డి గురువారం సీఐడీ, ఈడీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో సీఐడీ చీఫ్ చారుసిన్హాను కలిసి డాక్యుమెంట్లు అందజేశారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్, కవిత, జగన్‌మోహన్ రావుతో పాటు హెచ్‌సీఏ మాజీ డైరెక్టర్ వంక ప్రతాప్ మరికొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈడీ ఆఫీసులోనూ తమ ఫిర్యాదును అందజేశారు.
తెరవెనుక కేటీఆర్, కవిత
హెచ్‌సీఏలో జరిగిన అవినీతి అక్రమాల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉన్నట్టు తమకు సమాచారం ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాళ్లిద్దరూ తెరవెనుక ఉంటూ హెచ్‌సీఏను ప్రభావితం చేశారని, దీంతో హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్స్ ఎలాంటి భయం లేకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పలు టీవీ చానెల్స్‌లోనూ కథనాలు వచ్చిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీఎల్ టికెట్ల అమ్మకాల కాంట్రాక్టును కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు అప్పగించారని తెలిపారు. రాజ్ పాకాలకు చెందిన ‘ఈవెంట్స్ నౌ’ అనే యాప్ ద్వారా ఐపీఎల్ టికెట్లను విక్రయించారని చెప్పారు. అదే విధంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఫుడ్, ట్రావెల్స్ కాంట్రాక్టులు, హోటల్ బుకింగ్స్ సైతం కేటీఆర్, కవిత, జగన్ మోహన్‌రావు తమ బంధువులకే అప్పగించుకున్నారని వెల్లడించారు. ఫుడ్ కాంట్రాక్టును సురభి కేటరర్స్‌కు ఇచ్చారని పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులు అందజేత..
హెచ్‌సీఏకు సంబంధించి 2017లో జస్టిస్ అనిల్ దవే కమిటీ, 2023లో జస్టిస్ ఎల్.నాగేశ్వర్‌రావు కమిటీ ఇచ్చిన రెండు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులు, ఇతర ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్, డాక్యుమెంట్లను సీఐడీకి టీసీఏ ప్రతినిధులు అందజేశారు. హెచ్‌సీఏలో అవినీతికి సంబంధించిన కొన్ని వీడియోలు, పత్రికల్లో వచ్చిన వార్తా క్లిప్పింగ్స్ ఇచ్చారు. హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు క్రికెటర్ల ఎంపిక విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. హెచ్‌సీఏ మాజీ డైరెక్టర్ వంక ప్రతాప్ వ్యవహారంపైనా దర్యాప్తు చేయాలని కోరారు. తెలంగాణలో క్రికెట్‌ను కాపాడేలా ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.
అజారుద్దీన్ టైమ్‌లోనూ అక్రమాలు..
2019 నుంచి 2022 వరకు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ వ్యవహరించారని, ఆ టైమ్‌లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీసీఏ ఆరోపించింది. అజారుద్దీన్‌తో పాటు సభ్యులు జాన్ మనోజ్, ఆర్.విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయని తెలిపింది. వీళ్ల అవినీతిపైనా దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదులో పేర్కొన్న మరికొన్ని ముఖ్యాంశాలు..
- ఫోర్జరీ సంతకాలతో జగన్ మోహన్‌రావు దొడ్డిదారిన హెచ్‌సీఏలోకి వచ్చారు.
- క్రికెటర్ల ఎంపికలో అవినీతికి పాల్పడ్డారు. క్రికెటర్ల తల్లిదండ్రులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు.
- ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో పాటు ఇతర పనుల కోసం బెదిరింపులకు దిగారు.
- సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు.
- అధికారం లేకున్నా అక్రమంగా హెచ్‌సీఏ బ్యాంకు చెక్కులపై సంతకాలు చేసి మోసానికి పాల్పడ్డారు.
- మౌలిక వసతుల కల్పన పూర్తిగా వదిలేయడంతో పాటు రాష్ట్రంలోని క్రికెటర్ల జీవితాలతో చెలగాటమాడారు.
ఆ నిధుల ఖర్చుపై లెక్కల్లేవ్
బీసీసీఐ నుంచి వచ్చిన గ్రాంట్లు, క్రికెటర్ల సంక్షేమం, అభివృద్ధికి ఐపీఎల్ నుంచి వాటాగా వచ్చిన నిధులను దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత పదేండ్లలో బీసీసీఐ నుంచి వచ్చిన దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ. 600 కోట్లను దేనికి ఖర్చు చేశారన్న దానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు. ఈ నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్‌లో ఎక్కడ ఖర్చు చేశారన్న వివరాలు లేవని చెప్పారు. హెచ్‌సీఏ ఈ పదేండ్లలో ఎలాంటి ఆస్తులు కూడా సమకూర్చుకోలేదన్నారు. గత పదేండ్లలో హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్ల వ్యక్తిగత ఆస్తుల పెరుగుదలను పరిశీలిస్తే.. హెచ్‌సీఏలో జరిగిన అవినీతి అక్రమాలను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.