
హైదరాబాద్, వెలుగు: బస్సుల రాకపోకల సమయాన్ని ప్రయాణికులు ఈజీగా గుర్తించడం కోసం ఆర్టీసీ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. బస్సులు స్టాప్లకు చేరుకునే సమయాన్ని యాప్ ద్వారా తెలుసుకునే వీలు కల్పించింది. టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్ లోడ్ చేసుకొని ఈ సేవలు పొందొచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడిం చారు. ఈ యాప్ ను ఆయన మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా140 బస్సుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ లో పుష్పక్, మెట్రో లగ్జరీ, డీలక్స్, మెట్రో ఎక్స్ ప్రెస్ల వివరాలు యాప్లో ఉంటాయన్నారు.
ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్
గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. యాప్ డౌన్ లోడ్ లింక్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtc.telangana.gov.in ద్వారా అందిస్తున్నారు. ప్రస్తుత లొకేషన్, సమీప బస్ స్టాప్ నుంచి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేలా యాప్ను తయారు చేశారు. కండక్టర్, డ్రైవర్ ప్రవర్తన, బస్సు కండిషన్, డ్రైవింగ్ తీరుపై తమ అభిప్రాయాలను ఈ యాప్లో నమోదు చేయొచ్చు. గరుడ ప్లస్, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులు తిరిగే ప్రాంతాలు, స్టేజీల మధ్య బస్సుల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం రూట్లలో నడుస్తున్న పీకేటీ డిపో బస్సులకు ట్రాకింగ్ నడుస్తోందని ఆర్టీసీ తెలిపింది.