
- సమస్యలపై స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
- ఎన్నికల ముందు యూనియన్ నేతలతో మంత్రుల వరుస సమావేశాలు
- ఇపుడు యూనియన్ నేతలకు టైమ్ ఇవ్వని మంత్రులు
- సీఎం టైమ్ తీసుకుంటామని మంత్రి హరీశ్ హామీ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించటం లేదు. మునుగోడు బైపోల్ పూర్తయి నెల కావొస్తున్నా సమస్యల పరిష్కారంపై అడుగు ముందుకు పడ్తలేదు. పీఆర్సీలు, పెండింగ్ డీఏలు ఇవ్వాలని, యూనియన్లను అనుమతించాలని, రిటైర్ మెంట్ కార్మికులకు సెటిల్ మెంట్లు, సీసీఎస్ కు బకాయిల చెల్లింపు వంటి సమస్యలను మునుగోడు బైపోల్ ముందు ప్రభుత్వం ముందుంచారు. దీంతో 2017 పీఆర్సీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వమే ఈసీకి లేఖ రాసింది. తీరా ఎలక్షన్ అయ్యాక సప్పుడు చేస్తలేదు. దీంతో సర్కారు తీరుపై ఆర్టీసీ కార్మికులు ఫైర్ అవుతున్నారు.
రెండు గ్రూపులు వద్దు ఒక్కటే ఉండాలే
“టీఎంయూలో రెండు గ్రూపులు ఉండొద్దు. ఒక్కటే ఉండాలే. ఇక నుంచి టీఎంయూ ఎంతో ఆర్టీసీలో ఉన్న మిగత రెండు లెఫ్ట్ యూనియన్లు కూడా అంతే” ఇది ఇటీవల టీఎంయూ నేతలకు మంత్రులు చేసిన అల్డిమేటం. ఆర్టీసీలో టీఆర్ఎస్ అనుబంధ యూనియన్ గా చెప్పుకుంటున్న టీఎంయూలో రెండు గ్రూపులు (అశ్వత్థామరెడ్డి, థామస్ రెడ్డి వర్గాలు)ఉండటంపై సర్కారు సీరియస్ గా ఉంది. రెండు గ్రూపులు ఉండకుండా అందరూ ఒకే గ్రూప్‌గా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రెండు వర్గాల నేతలు సమావేశమై ఒక్కటవుదాం అని ఇటీవల రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే పదవుల పంపకం దగ్గర ఏకాభిప్రాయం రాకపోవటంతో మరోసారి సమావేశం అవుదామని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
లెఫ్ట్ యూనియన్లు కూడా సమానమే
ఆర్టీసీలో టీఎంయూతో పాటు సీపీఐ అనుబంధ యూనియన్ గా ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) ఉండగా, సీపీఎం అనుబంధంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్ డబ్ల్యూఎఫ్, సీఐటీయూ) కొనసాగుతున్నాయి. మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీల మధ్య కుదిరిన పొత్తు వచ్చే జనరల్ ఎలక్షన్స్ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీఎంయూతో సమానంగా ఈయూ, ఎస్ డబ్ల్యూఎఫ్ లు మాకు అంతే అని ప్రభుత్వం థామస్ రెడ్డి వర్గానికి చెప్పినట్లు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ డిపో లేదు.. చండూరు లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇది కూడా సాధ్యమయ్యేలా కనపడట్లేదు.
నో అపాయింట్ మెంట్
బైఎలక్షన్ తర్వాత నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలకు మంత్రులు ముఖం చాటేస్తున్నారు. యూనియన్ నేతలు మంత్రి హరీశ్‌రావును కలిసినప్పుడు మీ సమస్యలు చర్చించటానికి సీఎం దగ్గర టైమ్ తీసుకుంటానని చెప్పినట్లు ఆర్టీసీలో చర్చ జరుగుతోంది. ఇక అదే టైమ్ లో యూనియన్లను పునరుద్ధరిస్తామని ఎలక్షన్ ముందు తాము హామీ ఇవ్వలేదని మరో మంత్రి అన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏం చేయాలో యూనియన్ నేతలకు అర్థం కావటం లేదు. తాజాగా గురువారం మునుగోడులో ఐదుగురు మంత్రులు రివ్యూ చేసిన సందర్భంగా ‘మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య’ కన్వీనర్ రాజిరెడ్డి మంత్రి కేటీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మీ సమస్యలను తన పీఏకి వాట్సాప్ లో పంపాలని కేటీఆర్చెప్పినట్లు రాజిరెడ్డి తెలిపారు. మునుగోడులో సుమారు 7 వేల మంది కార్మికులు ఉన్నారని, వారి ఓట్ల కోసం బైఎలక్షన్ ముందు ఆర్టీసీ సమస్యలను పరిష్కరిస్తామని హడావుడి చేశారని ఇప్పుడు పట్టించుకుంటలేరని కార్మికులు మండిపడుతున్నారు.