కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడు పోయారు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడు పోయారు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ కు దగ్గర అయ్యాయని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడు పోయారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామస్తులతో షర్మిల ముచ్చటించారు. ఓట్లు కావాల్సి వచ్చినపుడు మాత్రమే సీఎం కేసీఅర్ బయటకు వస్తారని, గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తారని ఎద్దేవా చేశారు. 8 ఏళ్లుగా కేసీఆర్ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. మాట ఇవ్వడం, మాట మీద నిలబడటం అంటే కేసీఆర్ కు తెలియదని ఆరోపించారు. రాష్ట్రాన్ని కేసీఅర్ అప్పుల కుప్పలా మార్చేశాడన్న షర్మిల.. ప్రతీ కుటుంబం మీద 4 లక్షల అప్పు మోపారాని ఆరోపించారు. 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ఒక్క కుటుంబానికీ లక్ష రూపాయల ప్రయోజనం కూడా కాలేదని విమర్శించారు. ‘పేదవాడు అంటే కేసీఆర్ కు పురుగుల్లా కనిపిస్తారు. రాష్ట్రంలో బడులు, గుడులు లేవు. కానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోంది’ అని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా చేశారని, ఇది బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ.. బీర్ల తెలంగాణ అని అభివర్ణించారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సీఎం కేసీఆర్ రూ. 70 వేల కోట్ల కమీషన్లు  తీసుకున్నారని, ఈ విషయంలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీజేపీ చెప్తోంది గానీ బయట పెట్టదని వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణలో అడుగడుగునా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే రాజన్న బిడ్డ పాదయాత్ర చేస్తోందని చెప్పారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయినా వైఎస్సార్ మీకు కొత్త కాదని, ఆయన్ను అభిమానించే ప్రతి ఇంటిపై వైఎస్సార్ జెండా రెపరెపలాడాలని కోరారు. వైఎస్సార్ సంక్షేమం... వైఎస్సార్ తెలంగాణ పార్టీ తోనే సాధ్యమని చెప్పారు.