రష్యా తీరాన్ని తాకిన సునామీ.. నాలుగు మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు

రష్యా తీరాన్ని తాకిన సునామీ.. నాలుగు మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు

మాస్కో: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో 8.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల ధాటికి రష్యా తీరంలో సునామీ ఏర్పడింది. జపాన్, యూఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసిన నిమిషాల్లోనే సునామీ తీరాన్ని తాకింది. మూడు నాలుగు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం ఉప్పొంగుతుండటంతో తీరం అల్లకల్లోలంగా మారింది. 

ముఖ్యంగా సివెరో-కురిల్స్ ప్రాంతాన్ని సునామీ బలంగా ఢీకొట్టింది. అలల తాకిడికి ఈ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ బిల్డింగ్ కొట్టుకుపోయింది. చాలా వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రహదారులపై భారీగా పగుళ్లు ఏర్పాడ్డాయి. మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. రష్యా తీరంలో సునామీ సృష్టిస్తోన్న విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఈ భారీ భూకంప ప్రభావం జపాన్‎, అమెరికాపై కూడా పడింది. 

జపాన్‎కు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అలస్కా, హవాయి తీరం వైపు సునామీ దూసుకొస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తీరంలో ఎమర్జెన్సీ సైరన్లు మోగిస్తూ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సునామీ హెచ్చరికలు ఎత్తేసే వరకు తీర ప్రాంతాలకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. 

భారీ భూకంపం నేపథ్యంలో రష్యా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తీర ప్రాంత ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర తీరం వైపు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించింది. భూకంపం కేంద్రమున్న కమ్చట్కా ద్వీపకల్పంలో యుద్ధ ప్రాతిపదిక సహయక చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు రష్యా వెల్లడించింది.