జపాన్లో సునామీ.. తీరానికి కొట్టుకొచ్చిన వేల్స్.. తీర ప్రాంతాలు ఖాళీ చేసి కొండలపైకి జనాలు

జపాన్లో సునామీ.. తీరానికి కొట్టుకొచ్చిన వేల్స్.. తీర ప్రాంతాలు ఖాళీ చేసి కొండలపైకి జనాలు

రష్యాలో వచ్చిన భారీ భూకంపం ప్రపంచాన్ని భయపెడుతోంది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భూ ప్రకంపనలు రావడంతో సముద్రాల్లో అల్లకల్లోలం మొదలైంది. ఫసిఫిక్ మహా సముద్ర తీరంలో అలలు 50 సెంటీమీటర్ల పైకి ఎగిసి పడటంతో రష్యా, జపాన్, అమెరికా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయడం భయాందోళనలు కలిగిస్తోంది. 

రష్యా భూకంప ధాటికి జపాన్ లో సునామి అల్లకల్లోలం సృష్టించింది. జపాన్ పోర్ట్ లో 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు ఎగసిపడ్డాయి. భారీ అలలకు జపాన్ తతేయామా తీరంలోకి తిమింగళాలు, వేల్స్ కొట్టుకువచ్చాయి. డాల్ఫిన్స్, వేల్స్ కొటుకురావడం అంటే భారీ సునామీ తప్పదని జపాన్ దేశస్తులు భావిస్తున్నారు. ఇప్పటికే సునామీ అలలు జపాన్ తీర ప్రాంతాలను ముంచేయడంతో.. మరింత తీవ్ర ప్రభావం ఉంటుందేనే భయాందోళనలు మొదలయ్యాయి. 

ALSO READ | రష్యాలో 8.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

సునామీ మరింతగా విరుచుకుపడుతుందనే భయంతో జపాన్ తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు ఖాళీ చేస్తున్నారు. జపాన్ లోని ఇషినొమకీ పట్ణణంలో ప్రజలు సామాన్లు సర్దుకుని కొండ ప్రాంతాలకు బయల్దేరారు. హియోరియామా కొండపైకి వేల సంఖ్యలో జనం చేరుకోవడం.. 2004 నాటి సునామీ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. 

మొదటి సునామీ అలలు జపాన్ లోనే:

రష్యాలో వచ్చిన భయంకరమైన భూకంపానికి సునామీ అలలు మొట్టమొదటగా జపాన్ దేశాన్ని తాకాయి. జపాన్ ఉత్తర తీరంలోని హొక్కయిడో ప్రాంతాన్ని సునామీ అలలు ఢీకొన్నట్లు జపాన్ న్యూస్ ఏజెన్సీ NHK ప్రకటించింది. మొట్టమొదటి అలలు 30 సెంటీ మీటర్లతో దూసుకొచ్చినట్లు పేర్కొంది. సునామీ అలల ధాటికి తీరంలోని కొన్ని కట్టడాలు నేల కూలినట్లు పేర్కొంది. 

ఆ తర్వాత మరి కాసేపటికి 50 సెంటీమీటర్లలో వచ్చిన సునామీ అలలు.. తీర ప్రాంతాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. భారీ అలలకు వేల్స్, డాల్ఫిన్స్ కొట్టుకొచ్చినట్లు పేర్కొంది. తీరంలోని పెద్ద పెద్ద భవనాలు నీళ్లలో కొట్టుకుపోయాయని తెలిపింది. 

భారీ తిమింగళాలు, వేల్స్ సముద్రం అంతర్భాగంలో ఉంటాయని.. చిన్న చిన్న అలలకు, చిన్నపాటు సునామీ వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదని అధికారులు తెలిపారు. కానీ అంతపెద్ద జలచరాలు కొట్టుకురావడం చూస్తే సునామీ తీవ్రత భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. సునామీ మరింత తీవ్రంగా ఏ క్షణంలోనైనా వికృత రూపం దాల్చనుందని.. తీర ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ప్రజలను ఆదేశించారు. దీంతో కొండప్రాంతాలకు జనం తరలివెళ్తున్నట్లు NHK పేర్కొంది. 

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‎పై 8.8గా నమోదు అయ్యిందని రష్యా భూకంప కేంద్రం ప్రకటించింది.  బుధవారం (జూలై 30) ఉదయం 8:25 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. భూ కంప నేపథ్యంలో రష్యాకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ సంస్థ. యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‎పై 8.7గా నమోదైందని తెలిపింది.

19.3 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. రష్యాతో పాటు జపాన్, హవాయి, అలస్కా తీర ప్రాంతాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. తీర ప్రాంతంలో అలలు నాలుగు మీటర్ల మేర ఎగసిపడే అవకాశం ఉందని అంచనా వేసింది.