రష్యా భూకంపంతో 40 దేశాలకు సునామీ హెచ్చరికలు.. ఇండియాపై ప్రభావం ఉంటుందా..?

రష్యా భూకంపంతో 40 దేశాలకు సునామీ హెచ్చరికలు.. ఇండియాపై ప్రభావం ఉంటుందా..?

రష్యా కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భారీ భూకంపం ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. బుధవారం (జులై 30) ఉదయం 8.8 తీవ్రతతో వచ్చిన ఎర్త్ క్వేక్.. ప్రపంచ దేశాలను ప్రమాదంలో పడేసింది. ఇప్పటికే భూకంప ధాటికి రష్యా, జపాన్ దేశాలలో సునామీ సంభవించింది. రష్యాలో చాలా వరకు భవంతులు కూలిపోయాయి. భూప్రకంపనలతో ఫసిఫిస్ మహాసముద్ర కేంద్ర భాగంలో  మొదలైన అలజడితో సునామీ అలలు మొదలయ్యాయి. రష్యాతో పాటు జపాన్ లోనూ 30 నుంచి 50 సెంటీమీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని తాకడంతో తీవ్ర నష్టం జరిగింది. 

రష్యా తీరప్రాంతాలైన సెవిరో, కుర్లిక్స్ పట్టణాలను సునామీ అలలు తాకాయి. దాదాపు 3 మీటర్ల ఎత్తులో సునామీ అలలు పోటెత్తడంతో తీర ప్రాంతంలో దారుణంగా డ్యామేజ్ అయ్యింది. ఈ రెండు పట్టణాల్లోని భవంతులు, షెడ్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. ఇక జపాన్ లో హక్కయిడో పట్టణం నుంచి వకయామా వరకు సునామీ అలలు ఢీకొట్టాయి. 50 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చిన అలలు ఢీకొట్టడంతో తీరం అల్లకల్లోలం అయ్యింది. 

భూకంప తీవ్రతతో ఫసిఫిక్ మహాసముద్ర తీర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్, రష్యా, అమెరికా, చైనా, హవాయి, చిలీ, న్యూజీలాండ్, ఫిలిప్పీన్స్ తదితర 40 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఫసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ (PTWC). సముద్ర తీరప్రాంతాల్లో ఏ క్షణమైనా భారీ సునామీ అలలు చెలరేగవచ్చునని.. తీర ప్రాంతాలను ఖాళీ చేయాల్సింది సూచించింది. సునామీ హెచ్చరికలతో పడవలు, ఓడలను నిలిపివేశారు. అదే విధంగా మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. 

ఇండియా పరిస్థితేంటి..?

రష్యా కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భూకంపంతో ఫసిఫిక్ దేశాలలో సునామీ వచ్చినట్లుగా భారత సునామీ హెచ్చరికల కేంద్రం (ITWC) తెలిపింది. ఫసిఫిక్ సునామీతో భారత్ కు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. రష్యాలో 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం.. జపాన్ తీర ప్రాంతంలో సునామీకి కారణమైందని.. కానీ ఇండియాపై ఎలాంటి ప్రభావం లేదని నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) తెలిపింది. 

►ALSO READ | Trump Tariffs: ఇండియాపై 25 శాతం పన్ను.. తేల్చి చెప్పేసిన ట్రంప్..

పసిఫిక్ ప్రాంతంలో సునామీ ఎంత తీవ్రతతో వచ్చినా ఇండియాకు అంత ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత ఎంబసీ.. ఇండియన్స్ కు సేఫ్టీ అడ్వైజరీ జారీ చేసింది. కాలిఫొర్నియా, అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాలు, జపాన్, హవాయిలో ఉన్న ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఎంబసీ అధికారులకు తెలియజేయాలని సూచించింది.