
2025 జులై 30న రష్యా ఫార్ ఈస్ట్ ప్రాంతంలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో రిక్టర్ స్కేల్‌పై 8.7 నుండి 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సాన్ని సృష్టించింది. దీని ఫలితంగా రష్యా, జపాన్, ఇతర పసిఫిక్ ప్రాంత దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.ఎందుకంటే ఇది ఇటీవలి సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన భూకంపాలలో ఒకటిగా నమోదైంది.
రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.7 నుంచి 8.8గా నమోదు అయ్యింది. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో, జపాన్ ఉత్తర భాగంలోని హొక్కైడో దీవుల నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్‌స్కీ నగరంలో భవనాలు కంపించాయి.ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ ,సెల్‌ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడింది.
సునామీ ప్రభావం
భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. ఇది రష్యా ,జపాన్ తీర ప్రాంతాలను తాకింది. రష్యాలోని కురిల్ దీవులలోని సెవెరో-కురిల్స్క్ పట్టణంలో 3-4 మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడ్డాయి. ఓడరేవు మునిగిపోయింది. సఖాలిన్ ద్వీపంలో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంత భవనాలు నీటిలో మునిగాయి. అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటివరకు సమాచారం అందలేదు.
జపాన్ లోని హొక్కైడో దీవులలోని నెమురో హనసాకి ఓడరేవులో 30 సెంటీమీటర్ల (1 అడుగు) ఎత్తున మొదటి సునామీ అల నమోదైంది. 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది.హొక్కైడో నుంచి ఒకినావా వరకు 9లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని సూచించారు.
అమెరికా లోని అలాస్కా, హవాయి, వాషింగ్టన్, ఓరెగాన్, శాన్ ఫ్రాన్సిస్కో, దక్షిణ కాలిఫోర్నియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, చిలీ, ఈక్వెడార్, గ్వాటెమాల, కోస్టా రికా, పెరూ, మెక్సికో ,ఇతర పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలోని హోనోలులులో సునామీ సైరన్లు మోగాయి. ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు లేదా భవనాల 4వ అంతస్తుకు వెళ్లమని ఆదేశించారు.
అధికారుల హెచ్చరికలు ,చర్యలు
రష్యాలో అత్యవసర సేవలను చేపట్టారు స్థానిక అధికారులు. ప్రజలను తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండమని హెచ్చరించారు. మరోవైపు సునామీ హెచ్చరికలు జారీ చేసిందిజపాన్ వాతావరణ శాఖ. తదుపరి ఆదేశాల వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.సునామీ హెచ్చిరికలతో అమెరికాలో భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. హెల్ప్‌లైన్ నంబర్ +1-415-483-6629ని ఏర్పాటు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఎక్స్‌లో తెలిపింది.ఇక పసిఫిక్ తీర ప్రాంత దేశాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సునామీ సైరన్లు మోగించాయి. అత్యవసర చర్యలు చేపట్టాయి
ALSO READ : కాలిఫోర్నియాలో మొదటి సునామీ ప్రభావం..పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న అలలు
ఇప్పటివరకు ప్రాణ నష్టం గురించి ఖచ్చితమైన సమాచారం అందలేదు. రష్యాలోని సెవెరో-కురిల్స్క్ ఓడరేవు ,జపాన్‌లోని హొక్కైడోలో గోదాములు సునామీ అలల ధాటికి దెబ్బతిన్నాయి.భూకంపం , సునామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇవి ఈ ఘటన తీవ్రతను సూచిస్తున్నాయి.
భారత్‌కు సునామీ ముప్పు
భారత్‌కు సునామీ ముప్పు గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ, అమెరికాలోని భారత కాన్సులేట్ పరిస్థితిని సమీక్షిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఈ భూకంపం ప్రభావం భారత తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అమెరికాలోని భారతీయులకు భారత కాన్సులేట్ జనరల్ సూచించింది. ఎమర్జెన్సీ సిట్యూయేషన్స్‌కు సిద్ధంగా ఉండాలని.. మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు చార్జింగ్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్ +1-415-483-6629ను సంప్రదించాలని కోరింది.
రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో సంభవించిన 8.7-8.8 తీవ్రతతో కూడిన భూకంపం పసిఫిక్ ప్రాంతంలో సునామీని రేకెత్తించింది, దీని ఫలితంగా రష్యా, జపాన్, ఇతర దేశాలలో తీర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. అధికారులు వేగంగా స్పందించి, సునామీ హెచ్చరికలు జారీ చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో భూకంప ,సునామీ ప్రమాదాల గురించి గుర్తు చేస్తుంది. ప్రస్తుతం, నష్టాల గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేనప్పటికీ, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.