- యంగ్ ఇండియా, పబ్లిక్ స్కూళ్ల పేరుతో కొందరికే నాణ్యమైన విద్య
- టీఎస్ యూటీఎఫ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొద్దిమంది ధనవంతుల కోసం విదేశీ విద్యాలయాలను ఆహ్వానించడం మానుకొని, సామాన్య ప్రజలందరికీ నాణ్యమైన విద్యనందించేలా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ప్రైమరీ స్కూళ్లలో వెంటనే నర్సరీ, కేజీ తరగతులు ప్రారంభించాలని కోరింది. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని, జీవో 25ను సవరించి ప్రతి ప్రైమరీ స్కూల్ లో కనీసం ఇద్దరు టీచర్లు ఉండేలా చూడాలని, 50 మందికి పైగా విద్యార్థులుంటే తరగతికి ఒక టీచర్ ను నియమించాలని డిమాండ్ చేసింది.
శనివారం హైదరాబాద్ లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించి, విదేశీ బడులను ఆహ్వానించడం సరికాదన్నారు. ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ రిపోర్టును విడుదల చేసి, జూలై 1, 2023 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
