TTD : తిరుమల భక్తులకు కీలక సూచన.. ఆ సమయంలో భక్తులు కానుకలు ఇవ్వొద్దు

TTD : తిరుమల భక్తులకు కీలక సూచన.. ఆ సమయంలో  భక్తులు కానుకలు ఇవ్వొద్దు

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ  కీలక అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  గరుడసేవ రోజు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని  టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని..అలాంటి కానుకలతో తమకు  ఎలాంటి సంబంధమూ లేదని తెలిపింది. 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో టీటీడీ భక్తులకు ఈ మేరకు వినతి చేసింది.  

సెప్టెంబరు 24వ తేదీ సాయంత్రం చెన్నైలో గొడుగుల ఊరేగింపు ప్రారంభమవుతుంది. 25వ తేదీ తిరుచానూరుకు చేరుకుని అక్కడే బస చేస్తారు. శ్రీపద్మావతి అమ్మవారి ఆస్థానమండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి 2 గొడుగులను బహూకరిస్తారు. అనంతరం 27న తిరుమలకు చేరుకుని 7 గొడుగులను శ్రీవారికి బహూకరిస్తారు. 28న సాయంత్రం 6.30 గంటల వరకు శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.