మరింత క్వాలిటీతో తిరుపతి లడ్డు.. ఏఐతో 2 గంటల్లోనే భక్తులకు దర్శనం

మరింత క్వాలిటీతో తిరుపతి లడ్డు.. ఏఐతో 2 గంటల్లోనే భక్తులకు దర్శనం
  • ఏఐ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తున్నం: టీటీడీ చైర్మన్ బీఆర్​ నాయుడు

హైదరాబాద్, వెలుగు: తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ్యతతో అందిస్తున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. లడ్డూ నాణ్యత గతం కంటే చాలా బాగుందని భక్తులే చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. 

తిరుపతి స్థానికులకు నెలకోసారి మొదటి మంగళవారం 3 వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని, టూరిజం ప్యాకేజీలు రద్దు చేసి ఆ టికెట్లను సామాన్య భక్తులకు ఇస్తున్నామని వివరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని.. భద్రత, పారా మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

టికెట్ జారీలో సైబర్ నేరాలకు పాల్పడిన వారిని తొలగించి, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌‌‌ని ఏర్పాటు చేశామని చెప్పారు. అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకను అభివృద్ధి చేస్తామన్నారు. తిరుమలలో కాటేజీలకు సొంత పేర్లు తీసేసి దేవుడి పేర్లు పెట్టామని చెప్పారు. టీటీడీ కొనుగోళ్ల విభాగంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణకు ఆదేశించామన్నారు. తన ఏడాది పదవీకాలంలో ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని బీఆర్ నాయుడు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి టీటీడీ బోర్డు సమావేశంలోనే అన్యమతస్థులను తొలగించాలని నిర్ణయం తీసుకుని, కొందరిని తొలగించామని గుర్తుచేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత సహాయంతో 2 గంటల్లోనే భక్తులకు దర్శనం కల్పించే ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తున్నామన్నారు. అయితే, ఒక వర్గం దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేసిందని వివరించారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే చర్యలు తీసుకోవాలని తీర్మానించామని, అన్యమత ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్విమ్స్ ఆస్పత్రిని మెరుగుపరిచామని, మెడికల్ మాఫియా నడుస్తున్నందున మెడికల్ షాప్స్ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.

గరుఢ వారధిగా తిరుపతి ఫ్లైఓవర్‌‌‌‌కి నామకరణం చేశామని, కొండని ఆనుకుని ఉన్న స్థలంలో గతంలో అనుమతి ఇచ్చిన ముంతాజ్ హోటల్‌‌‌ను వేరే చోటికి మార్చామని తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, దీనికి తగ్గట్టుగా అడుగులు వేస్తున్నామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.