
తమిళ చిత్ర పరిశ్రమలో కొత్త వివాదంలో చిక్కుకుంది. తిరుమల శ్రీవారి పాటనే ర్యాప్ సాంగ్ మార్చి పారేసింది డీడీ నెక్ట్స్ లెవల్ సినిమా టీమ్. ఏడుకొండలవాడా.. వెంకటరమణ గోవిందా.. గోవిందా అంటూ తిరుమల కొండ మారు మోగుతుంది. నిత్యం వేలాది మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
వెంకటేశ్వరస్వామి భక్తులు శ్రీనివాస గోవిందా…. శ్రీ వెంకటేశ గోవిందా అంటూ స్వామిని కొలుస్తుంటారు. ఆ పిలుపునకు స్వామి వారు పులకించి… భక్తులకు అనుగ్రహం ఇస్తారు. హిందువులు పవిత్రంగా భావించే గోవింద నామాలను అభ్యంతరకరంగా ఓ చిత్రంలో వాడుకోవడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని టీటీడీ ఇప్పుడు సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టింది.
శ్రీనివాస గోవిందా…. శ్రీ వెంకటేశ గోవిందా అనే భక్తి గీతాన్ని ఓ సినిమాలో వ్యంగ్యంగా…. ర్యాప్ సాంగ్ గా చిత్రీకరించారు. దీనిపై టీటీడీపాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఇదే విషయంపై స్పందించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ గోవింద నామాలతో ర్యాంప్ సాంగ్ చిత్రీకరించిన చిత్రం యూనిట్ పై ధ్వజమెత్తారు.
చిత్ర కథానాయకుడు సంతానం, నిర్మాణ సంస్థ, తమిళనాడు సెన్సార్ బోర్డు కు నోటీసులు జారీ చేశారు. . డీడీ నెక్ట్స్ లెవల్ సినిమాలోని.. కిస్సా-47పాటను చూపించి.. తిరుమల శ్రీవారి పాటను ఎలా బద్నాం చేశారో భాను ప్రకాష్‌రెడ్డి చెప్పారు. వెంటనే సినిమాలోని ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సినిమాను కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారాయన.
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డిడి నెక్స్ట్ లెవల్ సినిమాలో పాట గోవిందా గోవిందా పాటని అసభ్యకరంగా చిత్రీకరించడంతో అందులో నటించిన హీరో సంతానం కి, నిహారిక ఎంటర్ టైన్ మెంట్ యాజమాన్యానికి, లీగల్ నోటీసులు జారీ చేశారు. 100కోట్ల పరువు నష్ట దావా వేస్తున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈనెల 16 న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ పాటను 90 లక్షల మంది వీక్షించారు.
దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనానికి భక్తులు వస్తారు అలాంటి ప్రాంతం నుంచే ఇలా గోవింద నామాలను అవహేళన చేసే విధంగా పాటను చిత్రీకరించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని వెంటనే ఆ పాటను చిత్రంలో నుంచి తొలగించిన తర్వాతే చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.