
తమిళనాడులో రోజు రోజుకీ కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పేద గొప్ప అన్న తేడా లేకుండా ఎవరినీ ఈ మహమ్మారి వదలడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి బోర్డు సభ్యుడు కుమారగురు కరోనా బారినపడ్డారు. తమిళనాడు తరఫున టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులైన ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కాగా, కుమార గురు తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా ఉలుందుర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తమిళనాడులో బుధవారం ఒక్క రోజే భారీగా 3,882 కరోనా కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 94,049కి చేరింది. కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,264కి చేరింది. తమిళనాడులో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఒక్క చెన్నైలోనే 60,533 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 52,926 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 39,856 మంది వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.