V6 News

తిరుమలలో మరో భారీ కుంభకోణం: పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ సరఫరా..!

తిరుమలలో మరో భారీ కుంభకోణం: పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ సరఫరా..!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్త కుంభకోణాలు బయటపడుతున్నాయి. శ్రీవారికి భక్తితో, పవిత్రంగా సేవలకు వినియోగించే వస్తువులు, వస్త్రాల విషయంలో మోసాలు జరుగుతున్నట్లు తాజాగా వెలుగులోకి రావటం రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవారి భక్తులనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

వివరాల్లోకి వెళితే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో సంచలన అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాతలు, వేద ఆశీర్వచనంలో పాల్గొనే భక్తులు, ముఖ్య అతిథులకు ప్రత్యేక దర్శనం సందర్భంగా అందించే 'పట్టు సరిగ దుప్పట్టా'(ఉత్తరీయాలు) కొనుగోలులో దశాబ్ద కాలంగా భారీ మోసం జరిగినట్లు టీటీడీ పాలక మండలి గుర్తించింది. పట్టు శాలువలకు బదులుగా పాలిస్టర్ దుప్పట్టాలను సప్లై చేసి రూ.55 కోట్ల మేర టీటీడీని మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును పూర్తి విచారణ కోసం ఏసీబీకి అప్పగించారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సప్లై అవుతున్న దుప్పట్టాలు.. టెండర్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేయడంతో మోసం బయటపడింది. టెండర్ నిబంధనల ప్రకారం.. ప్రతి దుప్పట్టా 100% స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, 20/22 డెనియర్ సిల్క్ నూలుతో తయారు చేయబడాలి. కనీసం 31.5 డెనియర్ కౌంట్ కలిగి ఉండాల్సి ఉంటుంది. ప్రతి ఉత్తరీయంపై ఒక వైపు సంస్కృతంలో, మరొక వైపు తెలుగులో “ఓం నమో వెంకటేశాయ”.. అలాగే శంఖు, చక్ర నామాలు ముద్రించబడి ఉండాలి. అయితే తాజా విజిలెన్స్ తనిఖీల్లో సరఫరా అయిన దుప్పట్టాలు పట్టు కాదని తేలింది.

ఈ దుప్పట్టాలను నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్ అనే సంస్థ సరఫరా చేస్తోంది టీటీడీకి. ఈ సంస్థ చాలా ఏళ్లుగా TTDకి వివిధ రకాల వస్త్రాలను సప్లై చేస్తోంది. VRS ఎక్స్‌పోర్ట్, దాని అనుబంధ సంస్థలు 2015-2025 మధ్యకాలంలో టీటీడీకి దాదాపు రూ.54.95 కోట్ల విలువైన వస్త్రాలను సప్లై చేసాయని తేలింది. తాజాగా.. పట్టు వస్త్రాల శాంపిల్స్ ను బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ ప్రయోగశాలలకు పంపగా.. రెండు ల్యాబ్స్ కూడా వాటిని 100% పాలిస్టర్‌గా తేల్చాయి. తప్పనిసరిగా ఉండాల్సిన పట్టు హలోగ్రామ్ ట్యాగ్ కూడా వాటిపై లేదని గుర్తించబడింది. ఈ మోసాన్ని టీటీడీ ఛైర్మన్ నమ్మక ద్రోహంగా అభివర్ణించారు. బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇందులో భాగమైన అందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డ్ అవినీతి నిరోధక శాఖను కోరింది.