టీటీడీ ఈవో ఇంకా చంద్రబాబు ఆదేశాలే పాటిస్తున్నారు: ర‌మ‌ణ‌దీక్షితులు

టీటీడీ ఈవో ఇంకా చంద్రబాబు ఆదేశాలే పాటిస్తున్నారు: ర‌మ‌ణ‌దీక్షితులు

టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ఇంకా మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఆదేశాల్నే పాటిస్తున్నార‌ని తిరుమల శ్రీవారి ఆల‌య మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు, టీటీడీ ఆగ‌మ స‌ల‌హాదారు ర‌మ‌ణ‌దీక్షితులు అన్నారు. హైకోర్టు తీర్పును, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌ను సైతం అమ‌లు చేయ‌డం లేదంటూ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. దాదాపు 20 మందికిపైగా వంశ‌పారంప‌ర్య (మిరాశీ) అర్చ‌కుల‌ను చంద్ర‌బాబు గ‌తంలో తొలగించార‌ని, అది రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని, చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య అని అన్నారు ర‌మ‌ణ దీక్షితులు. అయితే అర్చ‌కుల‌కు మ‌ళ్లీ విధుల్లోకి తీసుకోవాల‌ని హైకోర్టు ఆదేశించింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. అలాగే గ‌త ప్ర‌భుత్వంలో వంశ‌పారంప‌ర్య‌ అర్చ‌కుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి, వారిని తొల‌గించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన విష‌యాన్నీ ప్ర‌స్తావించారు. కానీ, టీటీడీ ఈవో, ఏఈవో నేటికీ చంద్ర‌బాబు ఆదేశాల‌నే శిర‌సావ‌హిస్తున్నార‌ని ర‌మ‌ణ దీక్షితులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోర్టు తీర్పును, జ‌గ‌న్ ఆదేశాల‌ను అమ‌లు చేసేందుకు వారు తిర‌స్క‌రిస్తున్నార‌ని తెలిపారు ర‌మ‌ణ దీక్షితులు. ఆ ఆదేశాల అమ‌లు కోసం తాము ఇంకా ఎదురుచూస్తున్నామంటూ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామిల‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈవోను తొల‌గింపుపై నెటిజ‌న్ ట్వీట్.. ర‌మ‌ణ‌ దీక్షితులు రీట్వీట్

టీటీడీ ఈవోను తొల‌గిస్తార‌ని తాను భావిస్తున్నానంటూ సాయి చైత‌న్య అనే నెటిజ‌న్ ర‌మ‌ణ‌దీక్షితులు ట్వీట్‌కు రిప్లైగా పోస్ట్ చేశాడు. అర్చ‌కుల‌ను మాన‌సికంగా వేధించ‌డంతో పాటు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఈవోపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని అందులో పేర్కొన్నాడు. న్యాయం ఆల‌స్య‌మ‌వ‌డ‌మంటే అన్యాయం జ‌ర‌గ‌డంతో స‌మాన‌మంటూ టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని ట్యాగ్ చేస్తూ ఈ విష‌యంపై వేగంగా స్పందించాల‌ని కోరాడు. అయితే ఆ నెటిజ‌న్ ట్వీట్‌ను ర‌మ‌ణ‌దీక్షితులు దానిని రీట్వీట్ చేశారు.