రోజుకు 45వేలమందికే శ్రీవారి దర్శనం

రోజుకు 45వేలమందికే శ్రీవారి దర్శనం

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి రేపటి(బుధవారం) నుంచి 15వేల టైంస్లాట్‌ టోకెన్లు మాత్రమే ఇవ్వనున్నట్లు TTD అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం నుంచి అన్ని రకాల దర్శనాలకు 45వేల మందికి మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా  నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపడతామన్నారు. 

భక్తులు భౌతిక దూరం పాటించేలా తిరుమల వెళ్లే బస్సులు, క్యూలైన్లను శానిటైజ్‌ చేస్తామని.. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే తిరుమలకు రావొద్దని కోరారు. కరోనా కేసులు తీవ్రమైతే శ్రీఘ్ర దర్శనం టికెట్లను రద్దు చేసి వాటిని మే, జూన్‌కు రీషెడ్యూల్ చేస్తామన్నారు. అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకున్నవారిని వారికి కేటాయించిన సమయానికి అరగంట ముందు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.