
ప్రతిరోజు లక్ష మంది భక్తులతో సందడిగా ఉన్న తిరుమలకొండ నిశ్శబ్దంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా శుక్రవారం మధ్యాహ్నం నుండి భక్తులను దర్శనానికి అనుమతించలేదు. శ్రీవారికి నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగాయి. సుప్రభాతం, అభిషేకం, బ్రేక్ దర్శనాలతోపాటు రూ.300, టైమ్ స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులను అనుమతించారు. మధ్యాహ్నం తర్వాత వైకుంఠ ద్వారం మూసివేశారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరగాల్సిన ఏకాంత సేవను రాత్రి 8.40 గంటలకే ముగించి ఆలయాన్ని మూసివేశారు. – తిరుమల, వెలుగు
యాదాద్రిలో ఫస్ట్ టైం..
యాదగిరికొండ, వెలుగు: కరోనా వైరస్ ప్రభావం యాదాద్రి ఆలయంపై పడింది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను కొండపైకి రానివ్వకుండా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా యాదాద్రి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ఆదేశానుసారం ఈ నెల 31 వరకు భక్తులకు స్వామి వారి దర్శనం ఉండబోదని ఆలయ ఈవో ఎన్. గీతారెడ్డి తెలిపారు. స్వామివారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు మినహా ఆర్జిత సేవలన్నీ రద్దు చేశామని ఆమె తెలిపారు. కాగా భక్తుల కోసం సిద్ధం చేసిన లడ్డూలను శుక్రవారం కొండ కింద భక్తులకు పంపిణీ చేశారు. యాదాద్రి ఆలయ చరిత్రలో స్వామి ఆర్జిత సేవలు, భక్తులకు దర్శనాలు నిలిపివేయడం ఎప్పుడూ జరగలేదని, ఇదే తొలిసారని ఆలయ ప్రధానార్చకులు కారంపూడి
నర్సింహాచార్యులు తెలిపారు.