తెలంగాణ లీడర్ల లేఖలపై తిరుమలలో ఇవాళ్టి నుంచి దర్శనం

తెలంగాణ లీడర్ల లేఖలపై తిరుమలలో  ఇవాళ్టి నుంచి దర్శనం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుమతిస్తున్నది. ఇది సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నది. ఇప్పటికే తాను పంపించిన లేఖను టీటీడీ అంగీకరించి, భక్తులకు బ్రేక్ దర్శనం టికెట్లు ఇచ్చిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఇందుకుగాను ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఈ అంశంలో చొరవ చూపినందుకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 

కాగా సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారాల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని.. రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాల్లో మాత్రమే తీసుకుంటామని టీటీడీ ఇటీవల ప్రకటించింది. రూ.300 దర్శనం టికెట్ల లేఖలపై ఏరోజుకా రోజు దర్శనం ఉంటుంది. నిర్దేశిత రోజుల్లో ఒక ప్రజాప్రతినిధికి సంబంధించి ఒక లేఖ మాత్రమే తీసుకుంటామని, ఒక  లేఖలో ఆరుగురు భక్తులకే దర్శనం ఉంటుందని పేర్కొంది.