- రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత తుమ్మల యుగంధర్
ఖమ్మం, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని, సత్యనిష్ఠతో పనిచేసే నాయకులను గెలిపించాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత తుమ్మల యుగంధర్ కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ఆయన రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కేవీ బంజర, రజబ్ ఆలీ నగర్, ఎన్వీ బంజర, మూలగూడెం, పంగిడి, ఈర్లపూడి, బద్యాతండ, పాపటపల్లి, జీకే బంజర, వీఆర్ బంజర, చిమ్మపూడి, కోటపాడు, కోయచెలక గ్రామాలను సందర్శిస్తూ గ్రామస్థులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ, రైతు భరోసా, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సన్న బియ్యం పంపిణి లాంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు.
అభ్యర్థులు ప్రజల మద్దతు పొందడానికి ఈ పథకాలను ఇంటింటికీ చేర్చి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలంటూ సూచించారు. రఘునాథపాలెం మండలాన్ని సస్యశ్యామలంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ పాల్గొన్నారు.
