అల్లకల్లోలంగా సముద్రం : 4 – 5 గంటల మధ్య తీరం దాటనున్న తుపాన్

అల్లకల్లోలంగా సముద్రం : 4 – 5 గంటల మధ్య తీరం దాటనున్న తుపాన్

బిపార్జోయ్ తుపాను గుజరాత్ ను వణికిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపార్జోయ్ తుపాను తీరం దిశగా దూసుకొస్తోంది. జూన్ 15న సాయంత్రం ఈ తుపాను ముందు అనుకున్నట్లుగా జఖౌ దగ్గర కాకుండా.. దిశ మార్చుకుని కచ్ దగ్గరే తీరం దాటనున్నట్లు వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 4 -5 గంటల్లో ఈ తుపాను తీర దాటనున్నట్టు వెల్లడించారు. చాలా బలంగా.. చాలా వేగంగా.. తీరాన్ని తాకబోతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఆందోళన నెలకొంది.

తుపాను భయంతో ఇప్పటికే గుజరాత్ లోని కచ్, ద్వారక, పోర్ బందర్, జామ్ నగర్, మోర్బీ, జునాగఢ్, రాజ్‌కోట్ జిల్లాల్లోని ప్రాంతాల ప్రజలను సముద్ర తీరం నుంచి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 75వేల మంది తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను తరలించారు. ఈ క్రమంలో కనీసం 135 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతూ.. 50 కిలోమీటర్ల పరిధిలో తుఫాన్ విధ్వంసం ఉండొచ్చని గుజరాత్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాగా, తుపాను ప్రభావం గుజరాత్, మహారాష్ట్రలతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, కేరళ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, లక్ష్యద్వీప్, దాద్రానగర్ హవేలీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ప్రయాణీకుల భద్రత, రైలు కార్యకలాపాలను నిర్ధారించడానికి ముందు జాగ్రత్త చర్యగా 76 రైళ్లు, 36 షార్ట్ టెర్మినేటెడ్ మరియు 31 షార్ట్-ఆరిజినేటెడ్ రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. గుజరాత్‌లోని రెండు ప్రసిద్ధ ఆలయాలు - దేవభూమి ద్వారకలోని ద్వారకాధీష్ ఆలయం, గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయం గురువారం మూసివేయబడుతుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.