టర్కీ, సిరియాలో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకపం శిథిలాల కింద బయటపడుతున్న శవాలు..గాయాలతో జనం ఆర్తనాదాలు...సాయం ఎదురు చూస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. భూకంపం ధాటికి టర్కీ, సిరియాల్లో మృతుల సంఖ్య 15వేలకు దాటింటి. గత దశాబ్ద కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంతగా మారణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. భూకంప తీవ్రతతో మృతుల సంఖ్య 20వేలకు చేరే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
మరోవైపు భూకంప బాధితులను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగాన్ పరామర్శించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో సహాయ శిబిరాలను సందర్శించారు. కహ్రామన్ మారాస్ ను సందర్శించి అక్కడి సమస్యలను పరిష్కరించారు. లోటు పాట్లు ఉన్నాయని ఒప్పుకున్నారు. భూకంపం వల్ల దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇలాంటి భయంకర విపత్తులకు ముందే సిద్ధంగా ఉండటం సాధ్యం కాదన్నారు. భూకంపంతో అల్లాడుతున్న ప్రజలకు మరింత సాయం అందించాలంటూ అధికారులను ఆదేశించారు.
సాయం కోసం సమావేశానికి ప్లాన్..
సోమవారం నాడు 7.8 తీవ్రతతో సంభవించిన భూ ప్రకంపనలతో టర్కీలో 12,391 మంది.. సిరియాలో 2,992 మంది మరణించారని అక్కడి అధికారులు, వైద్యులు తెలిపారు. మృతులు సంఖ్య 15,383కి చేరుకుందన్నారు. మరోవైపు బ్రస్సెల్స్‌లో ఈయూ సిరియా, టర్కీలకు అంతర్జాతీయ సహాయాన్ని సమీకరించడానికి మార్చిలో దాతల సమావేశానికి టర్కీ, సిరియా ప్లాన్ చేస్తోంది. అందరూ కలిసి ప్రజల జీవితాలను కాపాడేందుకు పని చేస్తున్నామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రతి సెకనుకు ఒకరు మృతి
భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో భయానక వాతావరణం నెలకొంది. శిథిలాలను తొలగించేందుకు సహాయ సిబ్బంది కూడా సరిపోవడం లేదు. దీంతో సిరియా, టర్కీలో ప్రతీ సెకనుకు ఒకరు చనిపోతున్నారు. కుప్పకూలిన ఒక్కో భవనం కింద కనీసం 400 నుంచి 500 మంది చిక్కుకున్నారు. సహాయక సిబ్బంది కేవలం 10 మంది మాత్రమే బయటకు తెచ్చారు. అటు సిరియాలో తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సిరియా, టర్కీ ప్రభుత్వాలు అంతర్జాతీయ సహాయం కోసం అభ్యర్థిస్తున్నాయి.
