బోర్డ్​కన్నా మెరుగ్గా.. పసుపు పంటకు ‘సిస్టమ్​’

బోర్డ్​కన్నా మెరుగ్గా..  పసుపు పంటకు ‘సిస్టమ్​’

నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు!

 ఎన్నికల కోడ్‌‌‌‌తో చివరి నిమిషంలో నిలిచిన ప్రకటన

 త్వరలో ప్రకటించనున్న కేంద్ర వాణిజ్య శాఖ

 స్పైసెస్‌‌‌‌ మార్కెటింగ్ సిస్టమ్‌‌‌‌ను చేర్చే ఆలోచన

పసుపు రైతులకు ప్రయోజనం చేకూరేలా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కంటే మెరుగైన వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సంక్రాతి నాడే దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ నుంచి ప్రకటన రావల్సిన ఉన్నా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. బడ్జెట్‌‌‌‌కు ముందే ఈ సిస్టమ్‌‌‌‌పై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ చేస్తారని కేంద్ర ప్రభుత్వ సీనియర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ఒకరు పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్రం స్పైసెస్ ప్రమోషన్ హబ్‌‌‌‌గా మారుతుందన్నారు. 1987లో నెలకొల్పిన స్పైసెస్ బోర్డు కేరళ కేంద్రంగా పని చేసిందని, ఇకపై ఆ బోర్డు నిజామాబాద్ కేంద్రంగా పని చేయనున్నట్లు సమాచారం.

దేశంలో మిర్చి, పసుపు పంటపై 40 శాతానికి పైగా రెవెన్యూ రాష్ట్రం నుంచే వస్తోంది. ఇందులో నిజామాబాద్, కరీంనగర్  ప్రధానమైనవి. కేంద్రం కొత్త నిర్ణయం వల్ల మిర్చి రైతులకు భారీ ప్రయోజనం కలుగనుంది. దాదాపు 10 నెలలుగా పసుపు రైతుల సమస్యలు, డిమాండ్లు, దేశ వ్యాప్తంగా ఈ పంటపై కేంద్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. పసుపు బోర్డు డిమాండ్ 30 ఏళ్ల నుంచి ఉన్నా…  బోర్డు ఏర్పాటు వల్ల కొత్తగా పసుపు రైతులకు ఆశించిన స్థాయిలో మేలు జరగదనేది కేంద్రం ఆలోచన. ప్రస్తుతం దేశంలో ఉన్న అనేక బోర్డులు తీసుకున్న నిర్ణయాల అమలు విషయంలో ఆలస్యమవుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా బోర్డులు పేరుకు మాత్రమే పరిమితం అన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు మేలు జరిగేలా కేంద్రం ఓ కొత్త  సిస్టమ్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిని ఐఏఎస్ స్థాయి ఆఫీసర్‌‌‌‌ పర్యవేక్షిస్తారు. ట్రేడ్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ స్కీమ్‌‌‌‌(టైస్‌‌‌‌) కింద భారీగా ఫండ్స్‌‌‌‌, మౌలిక వసతులకు కల్పించనున్నారు. ఇలా లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ ప్రయోజనాలు కల్పించేలా శాశ్వత పరిష్కారం రాబోతుంది. మిర్చితో పాటూ, మసాల ద్రవ్యాల మార్కెటింగ్ వ్యవస్థను నెలకొల్పనున్నారు.

కొత్త విధానంలో ఏం ఉండబోతుంది….

కొత్తగా ప్రతిపాదిస్తున్న వ్యవస్థతో రాష్ట్ర పసుపు క్లస్టర్‌‌‌‌గా మారనుంది. కేంద్ర ప్రభుత్వం 2017 లో తీసుకువచ్చిన టైస్‌‌‌‌తో వసతుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు. 2017-18, 2018-19 గానూ దాదాపు 600 కోట్లను కేంద్రం బడ్జెట్‌‌‌‌లో కేటాయించింది. ఇక బోర్డుల విషయానికి వస్తే, ప్రస్తుతం కాఫీ, టీ, పొగాకు, రబ్బర్, స్పైసెస్‌‌‌‌కు సంబంధించిన బోర్డులు ఉన్నాయి. ఇందులో చివరగా1987లో స్పైసెస్ బోర్డు కొచ్చిలో ఏర్పడింది.  వీటివల్ల పెద్దగా ఉపయోగం లేదనేది వాణిజ్యరంగ విశ్లేషకుల వాదన. అవి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, అవుట్ డేటెడ్ అయిపోయాయనే విమర్శలున్నాయి. ప్రస్తుతం దేశంలో టీ, కాఫీ రైతులు మాత్రమే మెరుగ్గా కన్పిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎగుమతులు పెరగడం. రైతులతో నేరుగా కంపెనీలు అగ్రిమెంట్‌‌‌‌ చేసుకొన్నాయి. దీంతో ప్రత్యక్షంగా రైతులకు ఆదాయం పెరగ్గా, పరోక్షంగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయి. ఇలాంటి చైన్ సిస్టమే ఇకపై తెలంగాణలో రానుంది. పసుపు ఎగుమతుల పెంపు, రైతులకు గిట్టుబాటు ధర, పసుపు పరిశ్రమల ఏర్పాటు దిశలో చర్యలను కేంద్రం చేపట్టనుంది. ఈ దిశలోనే బోర్డుకు మించిన వ్యవస్థను ప్రకటించనున్నట్లు సమాచారం.

ప్రాక్టికల్ సొల్యూషన్ ఉండాలి

30 ఏళ్లకు పైగా బోర్డు డిమాండ్ ఉంది. ఇది ఎమోషన్స్ తో కూడుకున్న అంశం. ఈ అంశాన్ని ఎమోషనల్‌‌‌‌గా తీసుకోకుండా పసుపు పంటకు, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రాక్టికల్ సొల్యూషన్ ఉండాలని కేంద్రం ఆలోచించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంలో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై నిజామాబాద్ ఎంపీ, రైతులు కేంద్ర హోం మంత్రిని షాను కలిశారు. ఈ సందర్భంగా ఎమోషన్స్ కాదు శాశ్వాత పరిష్కారమే తమ లక్ష్యమని షా స్పష్టం చేశారు. ఆ దిశలోనే ఆలస్యమైనా.. పసుపు రైతుల భవిష్యత్‌‌‌‌కు బంగారు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. అయితే, త్వరలో కేంద్రం ప్రకటించనున్న నూతన వ్యవస్థ, అమిత్ షా హామీకి తగ్గట్లుగానే ఉంటుందని సమాచారం.