నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతులు మరోసారి ధర్నాకి సిద్ధమవుతున్నారు. పసుపు క్వింటాలుకు 15వేలు, ఎర్రజొన్నలు క్వింటాలుకు 3500 ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు రెడీ అయ్యారు. ప్రభుత్వం ఈ నెల 7లోగా స్పందించకపోతే.. ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.
మార్కెట్లో ప్రస్తుతం పసుపు ధర.. క్వింటాకు 4 నుంచి 5వేలు మాత్రమే ఉంది. దీంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు రైతన్నలు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈనెల 7న ఛలో ఆర్మూర్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. పసుపు- ఎర్రజొన్న రైతుల డిమాండ్ల సాధన కోసం.. దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
పెట్టుబడి ఖర్చులు ఏటా పెరుగుతుంటే… మార్కెట్ లో మాత్రం ధర తగ్గుతూ వస్తుందంటోన్నారు అన్నదాతలు. 10ఏళ్ల క్రితం క్వింటా పసుపు 16వేలు ఉంటే.. ప్రస్తుతం 5వేల లోపే ఉందంటున్నారు. 9నెలలు కష్టపడి సాగు చేస్తే… కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు.
ఎర్రజొన్నలను కొనుగోలు చేసేందుకు సర్కారు ముందుకు రావాలని కోరుతున్నారు రైతులు. ఎర్రజొన్న వ్యాపారులు బై బ్యాక్ ఒప్పందం నిబంధన పాటించటం లేదని ఆరోపిస్తున్నారు. వ్యాపారులు కూటమిగా ఏర్పడి తమను మోసం చేయాలని చూస్తున్నారన్నారు.
మన రాష్ట్రంలో సరైన ధర లేకపోవడంతో మహారాష్ట్రలో అమ్ముకోవాల్సి వస్తుందనీ, అక్కడికి వెళ్తే రవాణా భారం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందంటున్నారు రైతులు.
