
- పసుపు రేటు పెరిగింది
- క్వింటాలుకు రూ.10 వేలు పలుకుతున్న ధర
- రేటు ఇంకా పెరుగుతుందంటున్న ట్రేడర్లు
- కేంద్రం దిగుమతులు ఆపేయడంతో పెరిగిన డిమాండ్
- చాలాఏండ్లకు గిట్టుబాటు ధరతో రైతుల్లో సంతోషం
నిజామాబాద్, వెలుగు: పసుపు రైతుల కళ్లలో సంతోషం నిండింది. నిజామాబాద్ మార్కెట్లో బుధవారం పసుపు క్వింటాల్ ధర రూ. 10 వేలు దాటింది. దాదాపు పదేళ్ల తర్వాత గిట్టుబాటు ధర రావడంతో రైతులు సంబుర పడుతున్నారు. రేటు ఉన్నప్పుడే అమ్ముకుందామని రైతులు తమ పంటను మార్కెట్‌కు తరలిస్తున్నారు. దేశంలో పసుపు పంటకు మేజర్ మార్కెట్ అయిన మహారాష్ట్రలోని సాంగ్లీలో క్వింటాల్ ధర రూ. 30 వేలు పలుకుతుండడం రైతుల్లో ఆశలు నింపుతోంది.
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. నిజామాబాద్ జిల్లాలో 40 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 20 వేల ఎకరాల్లో పండిస్తున్నరు. ఈసారి వానల వల్ల తెగుళ్లు సోకి దిగుబడి తగ్గిపోయింది. చాలా ఏండ్లుగా పసుపుకు క్వింటాలుకు రూ.6 వేలకు మించి ధర దక్కడం లేదు. మంగళవారం గరిష్టంగా రూ. 10,188 రేటు రాగా, బుధవారం రూ. 9,368 పలికింది. రేటు మరింత పెరిగి.. రూ.12 వేలకు చేరుకుంటుందని ఆఫీసర్లు చెప్తున్నరు. పసుపు రైతుల కష్టాల మీద ఫోకస్ చేసిన కేంద్రం ఇతర దేశాల నుంచి పసుపు దిగుమతులను నిలిపివేసింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మన పసుపుకు డిమాండ్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ అర్వింద్ ఇటీవల ప్రకటించారు. దీనికి తగ్గట్టే మార్కెట్లో పసుపు పంటకు డిమాండ్ పెరిగి.. ఎగుమతులు జోరందుకున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో పసుపు వాడకం పెరిగింది. నిజామాబాద్ నుంచి 4 విడతల్లో 9 వేల టన్నుల పసుపును ప్రత్యే క రైళ్లలో బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేశారు.
ఇంకా పెరిగే చాన్స్ ఉంది..
కిందటేడాదితో పోలిస్తే ఈసారి పసుపు పంటకు ధర బాగా పలుకుతోంది. పసుపు దిగుబడి ఈసారి బాగా తగ్గిపోయింది. దీంతో ధరలు పెరిగాయనుకుంటున్నం. ధర రూ.12 వేలు దాటే అవకాశాలున్నాయి. మోడల్ ధర రూ.7 వేల పైనే పలుకుతోంది. రైతులు సంతోషంగా ఉన్నారు.
– విజయ్ కిషోర్, గ్రేడ్-3 సెక్రటరీ, నిజామాబాద్ మార్కెట్ యార్డు
ధర పెరగడం కలిసొచ్చింది
నేను 30 గుంటల్లో పసుపు పంట వేశాను. ఈసారి వానలు బాగా పడి, రోగాలు వచ్చి.. దిగుబడి తగ్గింది. 32 డ్రమ్ములే పంట వచ్చింది. పోయినేడాది లెక్కనే ధర ఉంటదనుకున్న. పంట నష్టం, తక్కువ ధరతో పెట్టిన పెట్టుబడి కూడా రాదేమో అనుకున్న. కానీ ధర పెరగడం కలిసొచ్చింది. ఈసారి చాలా ఆనందంగా ఉంది. కానీ, మున్ముందు పసుపుకు రూ.15 వేలు మద్దతు ధర వస్తేనే రైతులకు లాభం ఉంటది.
– టమాట భూమన్న, పెర్కిట్, ఆర్మూర్